సాక్షి, హైదరాబాద్: ‘రాయల తెలంగాణ’ను తెరపైకి తేవడం తెలంగాణ రాష్ర్ట సమితిని రాజకీయంగా దెబ్బతీసే వ్యూహంలో భాగమేనని ఆ పార్టీ నాయకత్వం అనుమానిస్తోంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో టీఆర్‌ఎస్ అధిపత్యానికి గండి కొట్టడానికే రాయల తెలంగాణ చర్చను ప్రారంభించారని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. రాయల తెలంగాణ అనే ప్రతిపాదన ముందు పెట్టి హైదరాబాద్‌పై ఆంక్షలకు తెలంగాణ నేతలను ఒప్పించే ఎత్తుగడ కూడా ఇందులో ఉండొచ్చునని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీలో తీర్మానం, సీమాంధ్ర రాజధాని, జలాల పంపకం వంటి సమస్యలన్నీ తెలంగాణ 10 జిల్లాలతో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం వల్ల పరిష్కారమవుతాయనే వాదనలున్నాయి. రాయల తెలంగాణ ఏర్పాటుకు సాంకేతిక కారణాలంటూ బయటకు ఏం చెప్పినా ఈ ప్రతిపాదన వెనుక రాజకీయ కారణాలే బలంగా ఉన్నాయని టీఆర్‌ఎస్ అనుమానిస్తోంది. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ 10 జిల్లాల్లో జరిగిన సర్వేల్లో మాకు(టీఆర్‌ఎస్) ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు వస్తాయని తేలింది.
తెలంగాణలో వెయ్యి మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయమని కాంగ్రెస్ కోరితే.. టీఆర్‌ఎస్‌కు గౌరవప్రదమైన స్థానమే ఇవ్వాల్సి ఉంటుంది. విలీనం కాకపోతే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటది. ఇలాంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికే కాంగ్రెస్ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నట్టుంది’ అని కేసీఆర్ సన్నిహితుడొకరు విశ్లేషించారు. ‘హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడైతే టీఆర్‌ఎస్ పాత్ర పరిమితమే. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో బలం సగానికే ఉంది.
అంటే తెలంగాణలో దాదాపు సగం జిల్లాల్లో టీఆర్‌ఎస్ బలంగా లేదు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందనే సంకేతాలు కిందిస్థాయికి వెళ్తే ఆ పరిస్థితి మారుతుంది. అన్ని జిల్లాల్లో పార్టీ పుంజుకుంటది. కాని టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులొస్తయి. ఇప్పటికే 3 జిల్లాల్లో బలం లేకపోగా, పూర్తి వ్యతిరేకంగా ఉన్న మరో 2 జిల్లాలు కలిస్తే టీఆర్‌ఎస్ నామమాత్రం అవుతుంది, పార్టీ అధికారంలోకి రాదు అని తేలితే ఆ బలం కూడా తగ్గిపోతది. ఇవన్నీ పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకువస్తున్నారు’ అని కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మరో నేత అభిప్రాయపడ్డారు.
బీజేపీ, టీఆర్‌ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకిస్తారని తెలిసినా ‘రాయల’ ప్రతిపాదనను తేవడం రాజకీయ కారణాలతోనే అని పేర్కొన్నారు. ‘రాయల తెలంగాణ అయితేనే అసెం బ్లీలో తీర్మానం నెగ్గే అవకాశముంది. లేదంటే హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, ఆదాయం వంటివాటిపై అధికారాలను సీమాం ధ్రులు కోరుతున్నారు. వీటిలో ఏదో ఒకటి అయితే తప్ప మెజారిటీ సభ్యులు అంగీకరించే పరిస్థితి లేదు. అసెంబ్లీ తీర్మానం లేకుండా సాంప్రదాయాలను పట్టించుకోవడం లేదనే విమర్శలకు ఎందుకు అవకాశం ఇవ్వాలి. అందుకని ఏదో ఒకదానికి ఒప్పుకోవాలంటూ మెలికలు పెట్టే కుట్ర కూడా లేకపోలేదు’ అని మరో నేత పేర్కొన్నారు.
రాజకీయంగా దెబ్బతీసేందుకేనా?
Published Mon, Dec 2 2013 2:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement