కర్నూలు: లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి ప్రయత్నించిన లారీ డ్రైవర్ అదే లారీ కింద పడి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం గొర్లగుట్ట మలుపులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి పొద్దుటూరు వెళ్తున్న లారీ గొర్లగుట్ట మలుపు వద్ద బ్రేకులు చేడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నించాడు. కాని ప్రమాదవశాత్తూ లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన పెద్దయ్య(42)గా గుర్తించారు.
ఘటన సమయంలో లారీలో ఉన్న క్లీనర్ సహా మరో ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.