
గిరిజనులు ఒప్పుకుంటేనే ‘బాక్సైట్’
విశాఖ మన్యంలో గిరిజనులు అంగీకరిస్తేనే బాక్సైట్ తవ్వకాలకు చర్యలు చేపడతామని, వారి మనోభావాలకు విరుద్ధంగా ...
విశాఖపట్నం: విశాఖ మన్యంలో గిరిజనులు అంగీకరిస్తేనే బాక్సైట్ తవ్వకాలకు చర్యలు చేపడతామని, వారి మనోభావాలకు విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు చేపట్టమని రాష్ట్ర మంత్రులు రావెల కిశోర్‌బాబు, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావులు ముక్తకంఠంతో వెల్లడించారు. ప్రంపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానిక ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్‌లో ఆదివారం జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు ఆదివాసీల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆదివాసీ దినోత్సవాన్ని వచ్చే ఏడాది నుంచైనా గిరిజన ప్రాంతంలో నిర్వహించాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. కొండ కొమ్మరి తెగను గిరిజనులుగా గుర్తించాలన్నారు.
బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో ఎదుర్కొంటామని ఆమె హెచ్చరించారు. 55 ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికీ వృద్ధాప్య ఫించన్ సదుపాయం కల్పించాలని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు. గిరిజన ఉత్పత్తులను దళారీలు లేకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పధకాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ అన్నారు. ఏజెన్సీలో 3,500 శివారు ప్రాంతాలు ఉంటే 1500 ప్రాంతాలకు రోడ్లు లేవని జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ అన్నారు.
రూ.8.85కోట్లతో చింతపల్లి, అరకువేలీలో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్లను, రూ.2.35 కోట్లతో హుకుంపేటలో (బాలికల), డుంబ్రిగూడలో(బాలుర) నిర్మించిన పోస్టుమెట్రిక్ హాస్టల్ భవనాలను మంత్రులు ప్రారంభించారు. రూ.1.40 కోట్లతో అరకువేలీలో నిర్మించనున్న ఎడ్యుకేషన్ హబ్‌కు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.84.20 లక్షల విలువైన వ్యవసాయ ఉపకరణాలు, వృత్తి పనిముట్లను గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చదువులో ప్రతిభ కనబరిచి ఐఐటి,ఎన్‌ఐటిలో ప్రవేశాలు పొందిన గిరిజన విద్యార్థులకు ప్రసంశాపత్రాలు అందజేశారు. హెచ్‌ఈసీలో స్టేట్ ఫస్ట్ సాధించిన ఎన్ సునీల్, ఐఐటికి ఎంపికైన ఎం.పిన్నమ్మ, కె.రాజేష్, ఎన్‌ఐటికి ఎంపికైన బి.రవికుమార్, బైపిసీలో అత్యధిక మార్కులు సాధించిన వీణా మాధురి, ఉత్తమ ఎస్‌జిటి ఎస్ గుణవతి, ఎస్‌హెచ్‌జి లీడర్ ఎం.లింగమ్మ(శ్రీశైలం) పురస్కారాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరావు, పల్లా శ్రీనివాసరావు, వుడా వీసీ బాబూరావునాయుడు, జిసిసి ఎండి రవిప్రకాష్, మాజీ ఎంపి శంకరావు, మాజీ ఎమ్మెల్యేలు మణికుమారి, సివేరి సోమ, కుంభా రవిబాబు పాల్గొన్నారు. సీతంపేట, రంప చోడవరం, కెఆర్‌పురం, శ్రీశైలం, నెల్లూరు తదితర ఐటిడిఎలకు చెందిన గిరిజనులు కళారూపాలను ప్రదర్శించారు.