సాక్షి, తిరుపతి : తిరుమలలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని స్పష్టం చేశారు. చైర్మన్ కార్యాలయంలో ఆరోగ్య విభాగం అధికారి రాంనారాయణ్ రెడ్డితో వైవీ సుబ్బారెడ్డి పారిశుద్ధ్యంపై శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తిరుమలలో పారిశుద్ధ్య లోపంపై అనేక ఫిర్యాదులు అందాయని, వెంటనే చర్యలు చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నడకదారిలో వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా చెత్త సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అయితే ప్రస్తుతం చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించాలని చైర్మన్ హెల్త్ ఆఫీసర్‌కు చెప్పారు.
‘బర్డ్’ లో ఆకస్మిక తనిఖీ..
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ‘బర్డ్’ ఆస్పత్రిలో శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బర్డ్ (బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసెర్చ్, రిహబిలిటేషన్ ఫర్ డిజబుల్డ్)కి త్వరలోనే నూతన డైరెక్టర్‌ని నియమిస్తామని టీటీడీ చైర్మన్ అన్నారు. ఆస్పత్రిలో రూ.4 కోట్లతో నలభై పడకలు అదనంగా నిర్మిస్తామన్నారు. అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక శ్రీవారి దర్శనాలకు సంబంధించి లిస్ట్ 1, లిస్ట్ 2 దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని అన్నారు. వీఐపీ దర్శనాలకు క్రమబద్దీకరిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment