సామాన్య భక్తులకే ప్రాధాన్యం | TTD JEO Lakshmi Kantham Special Interview | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకే ప్రాధాన్యం

Published Fri, May 10 2019 10:37 AM | Last Updated on Fri, May 10 2019 10:37 AM

TTD JEO Lakshmi Kantham Special Interview - Sakshi

తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీటీడీ తిరుమల ఇన్‌చార్జి జేఈఓ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో తిరుమలకు భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న చర్యలను వివరించారు. మండుతున్న ఎండల నుంచి భక్తులకు రక్షణ కల్పించేలా చేపట్టిన ఏర్పాట్లను తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ధర్మప్రచారం, వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం తదితర అంశాలను వెల్లడిం చారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.

తిరుమల: వేసవి భక్తుల రద్దీ పెరగనున్న దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ తిరుమల ఇన్‌చార్జి జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు..

ప్ర: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?
జ:భక్తుల రద్దీకి అనుగుణంగా బ్రేక్‌ దర్శనాలు పూర్తిస్థాయిలో రద్దుచేశాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. వైకుంఠం1, 2లో నిరంతరం సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటుచేశాం. ఎల్‌ఈడీ టీవీల్లో 40 టీటీడీ ఆలయాల ప్రతిష్టను తెలిపేలా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం.

ప్ర: ఎన్నికల కోడ్‌తో వీఐపీ బ్రేకు దర్శనాలపై నియంత్రణ విధించారు. కొద్ది రోజులుగా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గుతోంది. దీన్ని మీరు ఎలా చూస్తారు?
జ:శ్రీవారి హుండీ ఆదాయం పెరిగేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఈ–హుండీ, ఈ–డొనేషన్ల (పుష్‌ నోటిఫికేషన్‌)లో పూర్తిస్థాయిలో పొందుపరిచాం. భక్తులు వాటి ద్వారా కానుకలు సమర్పించినా నేరుగా శ్రీవారికే చెందుతాయి.

ప్ర: గదుల నిర్వహణ ఎలా చేస్తున్నారు?
జ: భక్తులకు మూడు నెలల ముందు నుంచే ఆన్‌లైన్‌లో గదులు కేటాయిస్తున్నాం. కరెంటు బుకింగ్‌ కూడా వేగవంతంగా జరుగుతోంది. తిరుమలలో 6వేలు, తిరుపతిలో 1,000 రూములు, రాబోయే రోజుల్లో అలిపిరి వద్ద నిర్మాణాలు పూర్తయితే మరో 2వేల రూములు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్‌లో 9వేల గదులతో భక్తులకు బస ఏర్పాటు చేయవచ్చు.

ప్ర:టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరగనుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు?
జ: గతంలో తిరుచానూరు అమ్మవారి ఆలయాన్ని 10 నుంచి 15వేల మంది భక్తులు దర్శించుకునేవారు. రెండు నెలలుగా ఇది 25వేలకు చేరింది. తిరుమల స్థాయిలో అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం.

ప్ర: మీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మీ తనిఖీల్లో మీరు గుర్తించిన లోపాలను అధిగమించడానికి తీసుకున్న చర్యలు?
జ: ప్రతి ఉద్యోగి శ్రీవారికి సేవచేయడం అదృష్టంలా భావించాలి. ఉద్యోగులు ఏవైనా పొరపాట్లు చేస్తే ఒకటికి రెండుసార్లు సానుకూలంగా స్పందించి మార్పు వచ్చేలా చేయడం మొదటి ప్రాధాన్యత. తీరు మారకపోతే ఉపేక్షించేది లేదు.

ప్ర: తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయాన్ని భక్తులకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు?
జ:ఇప్పటికే పూర్తిస్థాయిలో అతిథిగృహాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎఫ్‌ఎంఎస్‌ మాత్రమే ప్రైవేటు వారికి అప్పగిస్తున్నాం. జూలై 10 కల్లా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇది డిప్యూటీ స్థాయి అధికారి, టీటీడీ సిబ్బందితోనే నడుస్తుంది.

ప్ర: తిరుపతిలో టీటీడీ ఆధీనంలో ఉన్న రోడ్లను ఆధునీకరించడానికి తీసుకున్న చర్యలు, వాటిని ఎప్పటికి పూర్తిచేస్తారు?
జ:తిరుమలలో ఎలా గ్రీనరీ ఉందో అదే తరహాలో తిరుపతిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. 26 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రారంభించాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే గోవిందనామాలను ఏర్పాటుచేశాం. ఇటీవల ఐఎస్‌ఓ ప్రమాణాలు నాణ్యత టీటీడీ అనుసరిస్తుందని, 10 ఇన్‌స్టిట్యూషన్లకు ఐఎస్‌ఓ భద్రత కల్పించారు.

ప్ర:ఆన్‌లైన్‌లో భక్తులు ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్‌లో వస్తున్న అనుమానాల నివృత్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ:ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించడంలో ఎలాంటి అవకతవకలు లేవు. ఆటోమెటిక్‌గా భక్తులకు కంప్యూటరే ఎంపిక చేసి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కేటాయిస్తుంది.

ప్ర: డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమం ద్వారా ఇప్పటికే భక్తుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. టీటీడీ చరిత్రలో లేని విధంగా తిరుపతి జేఈఓగా మీరు డయల్‌ యువర్‌ జేఈఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భక్తులకు ఎలా ఉపయోగపడుతుంది?
జ:ఇది డయల్‌ యువర్‌ జేఈఓ కాదు. భక్తులతో భవధీయులు అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల టీడీడీ అనుబంధ ఆలయాలు వాటి పనితీరు. భక్తుల సమస్యలు పూర్తిస్థాయిలో తెలుసుకుని వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది.

ప్ర: దేశంలోని వివిధ ప్రదేశాల్లో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి. ధర్మప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఆ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
జ:దివ్య క్షేత్రం నామకరణంతో ధర్మప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. సదా మీ సేవలో స్వామివారు అనే కార్యక్రమంతో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా దాతలు ఆ ప్రాంతాల్లో 10 నుంచి 50 ఎకరాల స్థలం కేటాయిస్తే ఆక్కడ ఆలయాలు నిర్మిస్తాం. అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా శ్రీవారి ఆలయాన్ని పూర్తిచేస్తాం. దేశమంతటా కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నాం. అమెరికాలోని మూడు ప్రాంతాల్లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం. మస్కట్, బెహరన్, దుబాయ్‌లలో ధర్మప్రచారాన్ని చేస్తున్నాం. రాష్ట్రంలోని 13వేల పంచాయతీల్లో ధర్మప్రచారం చేసేందుకు ప్రతి పంచాయతీ నుంచి వలంటీర్లను వెతుకుతున్నాం. స్కూళ్లు, కాలేజీల్లో సుపథం కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు భక్తిభావం పెరిగేలా శ్రీవారి గొప్పతనాన్ని వివరిస్తాం. ఎస్వీబీసీ ద్వారా చిన్నపిల్లలను ఆకట్టుకునేలా చోటాబీమ్‌ రూపంలో రామాయణం, మహాభారతం లాంటి కార్యక్రమాలను ప్రవేశపెడుతాం.

ప్ర:టీటీడీ ఆధీనంలో దాదాపు 295కు పైగా కల్యాణమండపాల ఆధునికీకరణ పనులపై ఎందుకు దృష్టి సారించలేదు?
జ:రాష్ట్రంలోని 295 కల్యాణమండపాలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా సదుపాయం కల్పించాం. దళారీలు ప్రయోజనాలు పొందకుండా ఈ అవకాశం కల్పించాం. స్వామివారిపై భక్తిభావం కలిగేలా కల్యాణమండపాలు ఆధునీకరించడానికి ఇప్పటికే సిద్ధం చేశాం. పది కల్యాణమండపాలను పైలెట్‌ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేస్తాం. మిగిలిన కల్యాణమండపాలను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.  

ప్ర: రద్దీ క్రమంలో భక్తుల మధ్య నెలకొనే తోపులాటల నివారణకు తీసుకున్న చర్యలు?
జ:క్యూల క్రమబద్ధీకరణకు షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా భక్తులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లుచేశాం. కంపార్టుమెంట్లలో చేరినప్పటి నుంచి బయటకు వచ్చి ఎలా నడుచుకోవాలి, టీటీడీ సిబ్బంది భక్తులతో ఎలా మెలగాలి అనే విషయాలపై భక్తుల్లో అవగాహనకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్యాణకట్ట, అన్నదాన సత్రాల్లో కూడా ఇదే తరహాలో అవగాహన కల్పిస్తున్నాం.

ప్ర:ఎండల నుంచి రక్షణకుతీసుకుంటున్న చర్యలు?
జ: మాడ వీధుల్లో రబ్బర్‌షీట్లు, కూల్‌ పెయింటింగ్‌ వేయించాం. నిరంతరం వాటర్‌ ట్యాంకర్లతో నీటిని చల్లుతూ భక్తులకు ఉపశమనం కల్పిస్తున్నాం. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం కనిపించేలా ‘ఎల్‌’ ఆకారంలో భక్తులకు ఎండ పడకుండా పైభాగాన్ని ఏర్పాటుచేశాం.

ప్ర: మీ పదవీ కాలం అతి తక్కువ అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి పూర్తవుతాయనే నమ్మకం ఉందా?
జ: నాకు ఇంకా 45 లక్షల సెకండ్లు ఉన్నాయి. స్వామి చెబితే ఒక యుగంలో జరగాల్సిన పనులు కూడా ఒక సెకనులో జరుగుతాయని భక్తిభావంతో నమ్ముతాను.

ప్ర:అవిలాల చెరువు మరమ్మతు పనులు మొదట దశ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో భక్తులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
జ: అక్టోబర్‌ 1వ తేదీకి మొదటి దశ పనులు పూర్తిచేసేలా ఇంజినీర్లు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో 2020 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా వేగంగా పనులు ప్రారంభిస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement