lakshmi kantham
-
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీటీడీ తిరుమల ఇన్చార్జి జేఈఓ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో తిరుమలకు భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న చర్యలను వివరించారు. మండుతున్న ఎండల నుంచి భక్తులకు రక్షణ కల్పించేలా చేపట్టిన ఏర్పాట్లను తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ధర్మప్రచారం, వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం తదితర అంశాలను వెల్లడిం చారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. తిరుమల: వేసవి భక్తుల రద్దీ పెరగనున్న దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ తిరుమల ఇన్చార్జి జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు.. ప్ర: వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? జ:భక్తుల రద్దీకి అనుగుణంగా బ్రేక్ దర్శనాలు పూర్తిస్థాయిలో రద్దుచేశాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. వైకుంఠం1, 2లో నిరంతరం సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటుచేశాం. ఎల్ఈడీ టీవీల్లో 40 టీటీడీ ఆలయాల ప్రతిష్టను తెలిపేలా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. ప్ర: ఎన్నికల కోడ్‌తో వీఐపీ బ్రేకు దర్శనాలపై నియంత్రణ విధించారు. కొద్ది రోజులుగా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా తగ్గుతోంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? జ:శ్రీవారి హుండీ ఆదాయం పెరిగేలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఈ–హుండీ, ఈ–డొనేషన్ల (పుష్ నోటిఫికేషన్)లో పూర్తిస్థాయిలో పొందుపరిచాం. భక్తులు వాటి ద్వారా కానుకలు సమర్పించినా నేరుగా శ్రీవారికే చెందుతాయి. ప్ర: గదుల నిర్వహణ ఎలా చేస్తున్నారు? జ: భక్తులకు మూడు నెలల ముందు నుంచే ఆన్లైన్లో గదులు కేటాయిస్తున్నాం. కరెంటు బుకింగ్ కూడా వేగవంతంగా జరుగుతోంది. తిరుమలలో 6వేలు, తిరుపతిలో 1,000 రూములు, రాబోయే రోజుల్లో అలిపిరి వద్ద నిర్మాణాలు పూర్తయితే మరో 2వేల రూములు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్‌లో 9వేల గదులతో భక్తులకు బస ఏర్పాటు చేయవచ్చు. ప్ర:టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరగనుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? జ: గతంలో తిరుచానూరు అమ్మవారి ఆలయాన్ని 10 నుంచి 15వేల మంది భక్తులు దర్శించుకునేవారు. రెండు నెలలుగా ఇది 25వేలకు చేరింది. తిరుమల స్థాయిలో అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ప్ర: మీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మీ తనిఖీల్లో మీరు గుర్తించిన లోపాలను అధిగమించడానికి తీసుకున్న చర్యలు? జ: ప్రతి ఉద్యోగి శ్రీవారికి సేవచేయడం అదృష్టంలా భావించాలి. ఉద్యోగులు ఏవైనా పొరపాట్లు చేస్తే ఒకటికి రెండుసార్లు సానుకూలంగా స్పందించి మార్పు వచ్చేలా చేయడం మొదటి ప్రాధాన్యత. తీరు మారకపోతే ఉపేక్షించేది లేదు. ప్ర: తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయాన్ని భక్తులకు ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు? జ:ఇప్పటికే పూర్తిస్థాయిలో అతిథిగృహాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఎఫ్ఎంఎస్ మాత్రమే ప్రైవేటు వారికి అప్పగిస్తున్నాం. జూలై 10 కల్లా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇది డిప్యూటీ స్థాయి అధికారి, టీటీడీ సిబ్బందితోనే నడుస్తుంది. ప్ర: తిరుపతిలో టీటీడీ ఆధీనంలో ఉన్న రోడ్లను ఆధునీకరించడానికి తీసుకున్న చర్యలు, వాటిని ఎప్పటికి పూర్తిచేస్తారు? జ:తిరుమలలో ఎలా గ్రీనరీ ఉందో అదే తరహాలో తిరుపతిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. 26 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రారంభించాం. ఈ ప్రాంతంలో ఇప్పటికే గోవిందనామాలను ఏర్పాటుచేశాం. ఇటీవల ఐఎస్ఓ ప్రమాణాలు నాణ్యత టీటీడీ అనుసరిస్తుందని, 10 ఇన్స్టిట్యూషన్లకు ఐఎస్ఓ భద్రత కల్పించారు. ప్ర:ఆన్లైన్లో భక్తులు ఆర్జిత సేవా టిక్కెట్ల బుకింగ్‌లో వస్తున్న అనుమానాల నివృత్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జ:ఆన్లైన్లో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించడంలో ఎలాంటి అవకతవకలు లేవు. ఆటోమెటిక్‌గా భక్తులకు కంప్యూటరే ఎంపిక చేసి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను కేటాయిస్తుంది. ప్ర: డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా ఇప్పటికే భక్తుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. టీటీడీ చరిత్రలో లేని విధంగా తిరుపతి జేఈఓగా మీరు డయల్ యువర్ జేఈఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం భక్తులకు ఎలా ఉపయోగపడుతుంది? జ:ఇది డయల్ యువర్ జేఈఓ కాదు. భక్తులతో భవధీయులు అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల టీడీడీ అనుబంధ ఆలయాలు వాటి పనితీరు. భక్తుల సమస్యలు పూర్తిస్థాయిలో తెలుసుకుని వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది. ప్ర: దేశంలోని వివిధ ప్రదేశాల్లో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి. ధర్మప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఆ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? జ:దివ్య క్షేత్రం నామకరణంతో ధర్మప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. సదా మీ సేవలో స్వామివారు అనే కార్యక్రమంతో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా దాతలు ఆ ప్రాంతాల్లో 10 నుంచి 50 ఎకరాల స్థలం కేటాయిస్తే ఆక్కడ ఆలయాలు నిర్మిస్తాం. అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా శ్రీవారి ఆలయాన్ని పూర్తిచేస్తాం. దేశమంతటా కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నాం. అమెరికాలోని మూడు ప్రాంతాల్లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం. మస్కట్, బెహరన్, దుబాయ్‌లలో ధర్మప్రచారాన్ని చేస్తున్నాం. రాష్ట్రంలోని 13వేల పంచాయతీల్లో ధర్మప్రచారం చేసేందుకు ప్రతి పంచాయతీ నుంచి వలంటీర్లను వెతుకుతున్నాం. స్కూళ్లు, కాలేజీల్లో సుపథం కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలకు భక్తిభావం పెరిగేలా శ్రీవారి గొప్పతనాన్ని వివరిస్తాం. ఎస్వీబీసీ ద్వారా చిన్నపిల్లలను ఆకట్టుకునేలా చోటాబీమ్ రూపంలో రామాయణం, మహాభారతం లాంటి కార్యక్రమాలను ప్రవేశపెడుతాం. ప్ర:టీటీడీ ఆధీనంలో దాదాపు 295కు పైగా కల్యాణమండపాల ఆధునికీకరణ పనులపై ఎందుకు దృష్టి సారించలేదు? జ:రాష్ట్రంలోని 295 కల్యాణమండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా సదుపాయం కల్పించాం. దళారీలు ప్రయోజనాలు పొందకుండా ఈ అవకాశం కల్పించాం. స్వామివారిపై భక్తిభావం కలిగేలా కల్యాణమండపాలు ఆధునీకరించడానికి ఇప్పటికే సిద్ధం చేశాం. పది కల్యాణమండపాలను పైలెట్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేస్తాం. మిగిలిన కల్యాణమండపాలను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. ప్ర: రద్దీ క్రమంలో భక్తుల మధ్య నెలకొనే తోపులాటల నివారణకు తీసుకున్న చర్యలు? జ:క్యూల క్రమబద్ధీకరణకు షార్ట్ ఫిల్మ్ ద్వారా భక్తులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లుచేశాం. కంపార్టుమెంట్లలో చేరినప్పటి నుంచి బయటకు వచ్చి ఎలా నడుచుకోవాలి, టీటీడీ సిబ్బంది భక్తులతో ఎలా మెలగాలి అనే విషయాలపై భక్తుల్లో అవగాహనకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్యాణకట్ట, అన్నదాన సత్రాల్లో కూడా ఇదే తరహాలో అవగాహన కల్పిస్తున్నాం. ప్ర:ఎండల నుంచి రక్షణకుతీసుకుంటున్న చర్యలు? జ: మాడ వీధుల్లో రబ్బర్షీట్లు, కూల్ పెయింటింగ్ వేయించాం. నిరంతరం వాటర్ ట్యాంకర్లతో నీటిని చల్లుతూ భక్తులకు ఉపశమనం కల్పిస్తున్నాం. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం కనిపించేలా ‘ఎల్’ ఆకారంలో భక్తులకు ఎండ పడకుండా పైభాగాన్ని ఏర్పాటుచేశాం. ప్ర: మీ పదవీ కాలం అతి తక్కువ అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవి పూర్తవుతాయనే నమ్మకం ఉందా? జ: నాకు ఇంకా 45 లక్షల సెకండ్లు ఉన్నాయి. స్వామి చెబితే ఒక యుగంలో జరగాల్సిన పనులు కూడా ఒక సెకనులో జరుగుతాయని భక్తిభావంతో నమ్ముతాను. ప్ర:అవిలాల చెరువు మరమ్మతు పనులు మొదట దశ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో భక్తులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? జ: అక్టోబర్ 1వ తేదీకి మొదటి దశ పనులు పూర్తిచేసేలా ఇంజినీర్లు పనిచేస్తున్నారు. పూర్తిస్థాయిలో 2020 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా వేగంగా పనులు ప్రారంభిస్తున్నాం. -
ఆ మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదు: కలెక్టర్
సాక్షి, కోడూరు : కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకోల్లలో చెలరేగిన స్వైన్ ఫ్లూ కలకలంపై కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. చింతకోల్లలో సంభవించిన మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదని తేల్చిచెప్పారు. అనారోగ్యంతో, కార్డియాక్ అరెస్ట్ కారణంగానే వారు చనిపోయినట్లు తెలిపారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులను స్వైన్ ఫ్లూ నెపంతో ఇబ్బందులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మందుస్తు నివారణకు ఆర్సీనిక్ అల్బెమ్ హోమియో మందు ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. -
ప్రాణాలు తీశాయా..?
మూడేళ్లుగా కోర్టులో నలుగుతున్న భూతగాదా కేసు నేపథ్యంలోనే ఆ దంపతుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలు గురువారం రాత్రి మక్కువ మం డ లంలో హత్యకు గురయ్యారు. భూతగాదా కేసు వాయిదా శుక్రవారం ఉండగా ప్రత్యర్థులే మాటువేసి ముందు రోజు హత్యలకు తెగబడ్డారని స్థానికులు, బంధువులు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మక్కువ మండలంలోని ఎస్.పెద్దవలస గ్రామానికి చెందిన వేమల భాస్కరరావు(56), లక్ష్మీకాంతం(50) గురువారం రాత్రి హత్యకు గురైనా శుక్రవారం ఉదయం వరకూ బయట ప్రపంచానికి తెలియ లేదు. సొంత గ్రామానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరిగినా, అది నిర్జన ప్రదేశం కావడంతో రాత్రంతా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. గ్రామానికి చెందిన భాస్కరరావు అదే వెంకటభైరిపురంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భార్య లక్ష్మీకాంతం పాచిపెంట జెడ్పీ హైస్కూలులో పనిచేస్తున్నారు. లక్ష్మీకాంతం పనిచేస్తున్న పాఠశాలలో గురువారం జరిగిన వార్షికోత్సవానికి ఆమె హాజరై తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ఆటోలో శంబర వరకు ఆమె చేరుకోగా గ్రామం నుంచి భాస్కరరావు ద్విచక్రవాహనం తీసుకుని శంబర వెళ్లారు. రాత్రి సుమారు 9.30గంటల సమయంలో ఎస్.పెద్దవలస గ్రామం ముందు తీళ్లవాని చెరువు వద్ద దారికాసిన దుండగులు ఇనుప రాడ్డుతో ఇద్దరి తలలపై బలంగా మోదడంతో ఆ దంపతులు అక్కడే పడిపోయారు. తీవ్ర రక్తస్రావం అవడంతో భాస్కరరావు అక్కడే మృ తి చెందారు. శంబర గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శుక్రవారం ఉదయం చూడడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీకాంతం కొనఊపిరితో ఉన్నట్లు గమనించి వెంటనే 108 వాహనంలో బొబ్బిలి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె నీలిమరాణి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి-భీమవరంలో, చిన్నకుమార్తె భారతీ దేవి విశాఖలో, కుమారుడు సాయిఅభిలాష్ ఒడిశాలోని రౌర్కెలాలో చదువుతున్నారు. పిల్లలు ముగ్గురు చదువుకునే వయసులో ఉండగా తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో వారు అనాథలయ్యారని బంధువులు, గ్రామస్తులు రోదించారు. తగాదా నేపథ్యం ఇది.. గ్రామానికి చెందిన అల్లు సత్యనారాయణకు, హత్యకు గురైన ఉపాధ్యాయ దంపతులకు మధ్య కొంతకాలంగా భూవివాదం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామసమీపంలో ఉన్న భూమిని అల్లు సత్యనారాయణ తల్లి అప్పలనరసమ్మ గతంలో భాస్కరరావుకు విక్రయిం చారు. అయితే అప్పట్లో తక్కువ ధరకు భూమిని అమ్మేశారని అపోహ పెట్టుకున్న సత్యనారాయణ మూడేళ్లుగా భాస్కరరావుతో గొడవ పడుతున్నాడు. వీటిపై పోలీస్‌స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ ఎప్పటికప్పుడు తిరుగుతున్నారు. శుక్రవారం బొబ్బిలి కోర్టులో వాయిదా ఉండగా గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. మద్యం సేవించి...రాడ్డుతో బాది ఉపాధ్యాయ దంపతులు హత్యకు గురైన ప్రదేశానికి సమీపంలో హంతకులకు చెందిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. తీళ్లవాని చెరువు సమీపంలోని అరటితోటలో మద్యం సీసాలు, వాటర్ ప్యాకెట్లు, గారెలు వంటివి లభ్యమయ్యాయి. దీనిని బట్టి భా స్కరరావు ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళ్లడాన్ని గమనించి పక్కా ప్రణాళిక వేసుకున్నట్టు అర్థమవుతోంది.. అలాగే హంతకుల్లో ఒకరి సెల్‌ఫోన్, చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు కూడా సంఘటనా స్థలానికి సమీపంలోనే దొరికింది. అయితే భూ తగదా జరుగుతున్న సత్యనారాయణపై అనుమానంతో పొలీసులు ఆరాతీయగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆదిశగా పోలీసు లు విచారణ మొదలు పెట్టారు. శోకసంద్రంలో గ్రామం గ్రామానికి చెందిన భార్యాభర్తలు హత్యకు గురికావడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధ్యాయ దంపతులు హత్య వార్త తెలుసుకుని మక్కువ, సాలూరు ,పాచిపెంట మండలాలనుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న నాయకులు హత్య జరిగిన విషయం తెలుసుకున్న సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీడిక రాజన్నదొర, మక్కువ మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు బొంగుచిట్టినాయుడు, లండ నరసింహమూర్తి, బొమ్మి కృష్టమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన ఉపాధ్యాయుల మృతదేహాలను చూసి విచారం వ్యకం చేశారు. సాలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి.భంజ్ధేవ్, మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, మండలకాంగ్రెస్నాయుకులు మావుడి రంగునాయుడు, మండలటీడీపీ అధ్యక్షుడు పెంట తిరుపతిరావు, సీపీఎం మండల నాయకులు చింతల తవిటినాయుడులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఇక ‘స్థానిక’ భేరి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తలమునకలైన అధికార యంత్రాంగం ఇక ‘స్థానిక’ సమరానికి కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కేవలం జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలు ప్రకటించారు. 52 మండలాల పరిధిలో ఉన్న 636 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. సోమవారంలోగా ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు అందడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 52 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అదేవిధంగా అన్ని మండలాల్లో కలిపి 636 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ షురూ చేయాలని ఫిబ్రవరి 24న జిల్లా పరిషత్ అధికారులకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆయా మండలాల ఎంపీడీవోలు పూర్తి చేశారు. ఇటీవల ఆర్డీవోల ద్వారా వీటిని కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. రిజర్వేషన్లపై కసరత్తు ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోల ఆధారంగా జిల్లా అధికారులు ‘స్థానిక’ రిజర్వేషన్లపై ఖరారు చేశారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను పరిగణలోకి తీసుకున్నారు. 1995, 2001, 2006 ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వు అయిందో పరిశీలించి రొటేషన్ పద్ధతిలో ఖరారు చేశారు. మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల విషయమై కమిషనరేట్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో ఖరారవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులతో కలెక్టర్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై కలెక్టర్ అహ్మద్‌బాబు శుక్రవారం పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ గజరావు భూపాల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, జెడ్పీ సీఈవో అనితగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు తదితరులతో కలిసి ఎంపీడీవో, ఈఆర్వో, ఏఈఆర్వోలు, నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ అంశంపై సమీక్ష నిర్వహించారు. -
సేఫ్ జోన్ల కోసం పైరవీలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా అధికారుల నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎన్నికల బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు తమను ఏ మూలన పడేస్తారోననే భయం వారిని ఆవహించింది. దీంతో వారు వీరు అని కాకుండా దాదాపు అందరూ సేఫ్ జోన్ల కోసం పైరవీలు ప్రారంభించారు. లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలోమూడేళ్ల కాలం పూర్తి చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో పాటు, పోలీసుల అధికారులను సైత ం జిల్లా దాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి పంపింది. జిల్లా నుంచి ఈ జాబితాలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కాంతం, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచల్‌రెడ్డి, డీఆర్వో రామిరెడ్డితో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. వీరితో పాటు జిల్లాలోని 56 మంది తహశీల్దార్లు, 42 మంది ఎంపీడీవోలు కూడా బదిలీలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఉద్యోగ విరమణకు ఆర్నెల్ల గడువు మాత్రమే ఉన్న వారికి ఎన్నికల సంఘం బదిలీ నుంచి మినహాయింపునిచ్చి ఇలాంటి వారిని ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలని ఆదేశించింది. ఈనెల 10వ తేదీకి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా స్థాయి అధికారులు నెల్లూరు నుంచి అటు చిత్తూరుకో, ఇటు ఒంగోలుకో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కుదరని పక్షంలో స్థానికంగానే ప్రాధాన్యత లేని పోస్టుల్లోనో, ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టుల్లోనో నియమింప చేసుకోవడానికి అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అనేక మంది తహశీల్దార్లు, ఎంపీడీవోలు సైతం రాజధానికి చేరుకుని పైరవీలు ప్రారంభించారు. ఎంతో కాలంగా జిల్లాలో పనిచేసి ఇప్పుడు వేరే జిల్లాకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని, కుటుంబానికి దూరం కావడంతో పాటు, ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులందరూ కంగారు పడుతున్నారు. జిల్లా స్థాయి అధికారి ఒకరు పక్కనే ఉన్న చిత్తూరుకు వెళ్లడానికి పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గతంలో ఆ జిల్లాలో పని చేసినందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని, నెల్లూరుకు కూడా దగ్గరే ఉండటంతో కుటుంబానికి అందుబాటులో ఉండొచ్చనే అభిప్రాయంతో ఆయన అధికార పార్టీ ముఖ్య నేత ద్వారా సంబంధిత శాఖ కార్యదర్శిపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలి సింది. ఇదే కోవలో అనేక మంది తమ చేతనైన మేరకు పైరవీలు జరుపుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బది లీల ఉత్తర్వులు జిల్లాకు అందనుండటంతో కొందరు నాలుగైదు రోజులుగా రాజధానిలోనే మకాం వేశారు. ఎన్జీవోల సమ్మెతో బదిలీలకు ఎలాంటి సంబంధం ఉండదని, ఉత్తర్వులు అందిన వెంటనే కొత్త స్థానాలకు వెళ్లక పోతే కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు.