సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తలమునకలైన అధికార యంత్రాంగం ఇక ‘స్థానిక’ సమరానికి కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కేవలం జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలు ప్రకటించారు. 52 మండలాల పరిధిలో ఉన్న 636 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. సోమవారంలోగా ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశాలు అందడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ మేరకు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 52 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అదేవిధంగా అన్ని మండలాల్లో కలిపి 636 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ షురూ చేయాలని ఫిబ్రవరి 24న జిల్లా పరిషత్ అధికారులకు పంచాయతీరాజ్‌శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆయా మండలాల ఎంపీడీవోలు పూర్తి చేశారు. ఇటీవల ఆర్డీవోల ద్వారా వీటిని కలెక్టర్ ఆమోదం కోసం పంపారు.
రిజర్వేషన్లపై కసరత్తు
ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోల ఆధారంగా జిల్లా అధికారులు ‘స్థానిక’ రిజర్వేషన్లపై ఖరారు చేశారు. ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను పరిగణలోకి తీసుకున్నారు. 1995, 2001, 2006 ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వు అయిందో పరిశీలించి రొటేషన్ పద్ధతిలో ఖరారు చేశారు. మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల విషయమై కమిషనరేట్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో ఖరారవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
అధికారులతో కలెక్టర్ సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై కలెక్టర్ అహ్మద్‌బాబు శుక్రవారం పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఎస్పీ గజరావు భూపాల్, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, జెడ్పీ సీఈవో అనితగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు తదితరులతో కలిసి ఎంపీడీవో, ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు, నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఇక ‘స్థానిక’ భేరి
Published Sat, Mar 8 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement