టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: బాబు
సాక్షి, తిరుమల: ‘‘తిరుమల కలియుగ వైకుంఠం. ఇక్కడ గాలిలో కూడా దైవం ఉన్నాడు. గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించకూడదు. ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేస్తాం. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత గురువారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ... ‘‘కొన్నేళ్లుగా తిరుమల కేంద్రంగా అనేక అపచారాలు జరిగాయి. వాటిని ప్రక్షాళన చేసి శ్రీవారి ప్రతిష్టను పెంచుతాం. శేషాచలంలోని అపారమైన ఎర్రచందనాన్ని సంఘ విద్రోహలు లూటీ చేశారు. అందుకు గత ప్రభుత్వాలు కూడా సహకరించాయి. ఇకపై ఎర్రదొంగల ఆటకట్టిస్తాం. వారిని పట్టుకోవడంలో విఫలమైన పోలీసు శాఖను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తాం’’ అని చెప్పారు.