శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు.. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబే అభాండాలు
ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్‌లో దుర్ఘటన
మొన్న యాత్రిక సదన్ పైనుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి
లడ్డూ కౌంటర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
రెండో ఘాట్‌లో రోడ్డులో ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
శ్రీవారి ఆలయ గోపురంపై పలుమార్లు విమానాల చక్కర్లు
తిరుమలలో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు
ఇప్పుడు తిరుమలకు వచ్చిన భక్తుల వద్ద ఎగ్ పలావ్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతిలో వరుసగా జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలేశుని భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవోనే పెద్ద అభాండం వేశారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందంటూ జరిగిందంటూ కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి తిరుమల తిరుపతిలో వరుస సంఘటలు అధకార కూటమి నేతలు చేసిన తప్పులకు పర్యావసానమేనని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఇటీవల తిరుపతి క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం సహా పలు జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం తిరుమలలో కొందరు భక్తులు ఎగ్ పలావ్‌ని కొండపైకే తెచ్చి, అక్కడే తినడం మరింత కలకలం రేపింది. ఈ వరుస అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. అయినా ఒక చిన్న అవాంఛనయ సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఉన్నంత పటిష్టమైన ప్రణాళికలు దేశంలో ఎక్కడా లేవు. అందుకే 9 నెలల క్రితం అయోధ్య రామాలయం ట్రస్ట్ నిర్వాహకులు తిరుమలలోని క్యూలైన్ వ్యవస్థను పరిశీలించి, టీటీడీ అధికారులతో చర్చించి వెళ్లారు. అనంతరం టీటీడీ ఇంజినీరింగ్ నిపుణులు అయోధ్యకు వెళ్లి అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వచ్చారు కూడా. అంతటి సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో కూటమి ప్రభుత్వం స్వార్ధపూరిత చర్యలకు దిగింది. దాని పర్యవసానమే ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్‌లో తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.
ఎందుకింత నిర్లక్ష్యం?
తొక్కిసలాట ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్ లో షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ కౌంటర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత తిరుమల రెండో ఘాట్ రోడ్ వద్ద ఆర్టీసి బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తుల్లో 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం తిరుమల పద్మనాభం యాత్రిక సదన్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారిపడి మృతి చెందాడు.
గత ఆదివారం పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ని చోరీ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అంతకు ముందు ఇదే వ్యక్తి పరకామణిలో మరిన్ని దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు తెలిసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. తిరుమల ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇంకోపక్క తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్ఛగా తరలిస్తున్న విషయం బయటపడింది. ఇలా తరలిస్తున్న వారిలో కొందరిని టాస్‌్కఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం తమిళనాడుకు చెందిన 18 మంది భక్తులు ఎగ్ పలావ్ తో తిరుమల కొండ పైకి వచ్చేశారు. తిరుపతిలోనే పూర్తిగా తనిఖీ చేసి పంపే పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా వీరు నిషేధిత ఆహార పదార్థాలతో తిరుమలకు చేరుకోవడం, శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని రాంబగీచ వద్దే ఆరగించడం అందరినీ విస్తుగొలిపింది.
ఆ ప్రాణాలకు ఇచ్చే విలువ ఇంతేనా?
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు జారీకి సరైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ ఫలితమే భైరాగిపట్టెడ పద్మావతి పార్క్, శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువేమిటో ఇక్కడే వెల్లడైంది. చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ రూ.25 లక్షలు చొప్పున మాత్రమే పరిహారం చెల్లించింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, ప్రతి కుటుంబానికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని పలు పారీ్టలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment