విశాఖలో కన్నీటి ‘గోదారి’ | Two Bodies Found In Godavari River | Sakshi
Sakshi News home page

విశాఖలో కన్నీటి ‘గోదారి’

Published Tue, Sep 17 2019 8:00 AM | Last Updated on Tue, Sep 17 2019 8:02 AM

Two Bodies Found In Godavari River - Sakshi

అప్పలనరసమ్మ మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, విశాఖపట్నం : ఆదివారం జరిగిన బోటు ప్రమాదంతో విశాఖ జిల్లా కన్నీటి గోదారిలో మునిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది గల్లంతవ్వగా.. ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటి వరకూ లభ్యమయ్యాయి. మిగిలినవారు ఎక్కడున్నారు..? ఏ పరిస్థితుల్లో ఉన్నారు.? అసలున్నారా.? ఎప్పుడు వస్తారు.? వస్తారో రారో..? రెండు నెలల్లో పెళ్లి పీటలెక్కనున్న ఆ అమ్మాయి గోదారిలో జరిగిన ఘోరానికి బలైపోయిందా..? ఇలా అనేక విషాద ప్రశ్నలు బంధువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారమైన గుండెలతో తమ వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తున్న ఏ కుటుంబాన్ని చూసినా విషణ్ణ వదనాలే కనిపిస్తున్నాయి. ఏ గుండెను కదిలించినా ఆవేదన స్వరాలే వినిపిస్తున్నాయి. పాపికొండలు విహార యాత్రకు వెళ్లిన 13 మంది కుటుంబసభ్యులు, బంధువుల్లో 12 మంది గోదావరిలో గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

అదేవిధంగా గాజువాకకు చెందిన అయిదుగురు కూడా పాపికొండలు చూసేందుకు వెళ్లి గల్లంతయ్యారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గల్లంతైన వారి ఆచూకీ కోసం నిర్వహించిన గాలింపు చర్యల్లో ఆరిలోవ ప్రాంతానికి చెందిన అప్పల నర్సమ్మ, వేపగుంటకు చెందిన లక్ష్మి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన 10 మంది ఏమయ్యారోనన్న ఆందోళన ఆ కుటుంబాల్ని శోక సంద్రంలో నెట్టేస్తోంది.  ఎక్కడో ఒకచోట ప్రాణాలతో ఉంటారనే ఆశతో ఆవేదనా భరితమైన వదనాలతో బంధువులు ఎదురుచూస్తున్నారు.

మావాళ్లు కాకూడదు భగవంతుడా..!!
సోమవారం ఉదయం గాలింపు చర్యలు మొదలైనప్పటి నుంచి గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు తమవారి ఆచూకీ దొరుకుతుందని ఊపిరి బిగబట్టుకొని ఆశగా ఎదురుచూశారు. సామాజిక మాధ్యమాలు, టీవీల్లో వస్తున్న ప్రసారాల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కి మాటిమాటికీ ఫోన్‌ చేసి ఏమైనా సమాచారం వచ్చిందా అని అడుగుతూ ఉన్నారు. సహాయక చర్యలు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయన్న సమాచారం వచ్చింది. ఇది విన్న బంధువులు ఆ దొరికిన మృతదేహాలు.. మా వాళ్లవి కాకూడదు దేవుడా అని ప్రార్థించారు. కానీ అందులో ఒకటి ఆరిలోవకి చెందిన తలారి అప్పలనర్సమ్మదనీ, మరొకటి వేపగుంటకు చెందిన లక్ష్మిగా గుర్తించగానే బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.

రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
అనకాపల్లి: గోపాలపురానికి చెందిన భూసాల పూర్ణ, భూసాల సుస్మిత, పెదిరెడ్డి దాలమ్మ ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందరూ సురక్షితంగా బయటపడాలంటూ ఊరంతా ఏకమై భగవంతుణ్ణి వేడుకుంటోంది. కానీ ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనంటూ గుండెలు బిగబట్టుకొని గ్రామస్తులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. గోపాలపురం వాసులు సోమవారం ఏ పనికీ వెళ్లకుండా ఊరిలోనే  ఉండిపోయారు. పాపికొండలను చూసేందుకు వెళ్లిన భూసాల పూర్ణకు మరో రెండు నెలల్లో పెళ్లి కానుంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆమె తండ్రి రమణ తీవ్ర దుఖఃసాగరంలో మునిగాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని భావిస్తే.. ఇలా దేవుడు అంతం చేశాడంటూ ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.  వారిని ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు

చేనుల అగ్రహారంలో గంభీర వాతావరణం.. 
చేనుల అగ్రహారానికి చెందిన మధుపాడ రమణ బతుకుతెరువు కోసం విశాఖ వెళ్లిపోయాడు. క్యాంటిన్‌ పనులు నిర్వహించడంతోపాటు వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న రమణ కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా తెలియరాకపోవడంతో చేనుల అగ్రహారం గ్రామంలో గంభీర వాతావరణం నెలకొంది. 

కళ్లముందే మునిగిపోయారు..
అనకాపల్లి: పడవ మునిగిపోయిన ఘటనలో కళ్లముందే నా కుటుంబీకులందరూ నీట మునిగిపోతున్నా ఏం చేయలేకపోయానని గోదావరిలో గల్లంతై సురక్షితంగా బయటపడిన భూసాల లక్ష్మి తెలిపింది. లైఫ్‌జాకెట్‌ తనను కాపాడిందని ‘సాక్షి’తో ఆమె సోమవారం మాట్లాడుతూ చెప్పారు. తమ వారంతా బతికే ఉంటారని ఆశిస్తున్నానని రోదిస్తూ చెప్పింది. తన అల్లుడు రమణబాబు పాపికొండలను చూపిస్తానంటే  13 మందిమి ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి రైలులో బయల్దేరి రాజమండ్రికి చేరుకున్నామని, అక్కడి నుంచి గండిపోచమ్మ గుడికి కారులో వెళ్లినట్టు చెప్పారు. మధ్యాహ్నం 11.30 గంటలకు బోటు ఎక్కామని, చాలా మంది లైఫ్‌జాకెట్‌ వేసుకోలేదని పేర్కొంది. బోటు ప్రయాణం మొదలైన గంట తర్వాత ఒక్కసారిగా కుదుపు వచ్చిందని... తేరుకునేలోపే పడవ బోల్తాపడిందని వివరించింది. లైఫ్‌జాకెట్‌ ఉన్న నేను నీటిపై తేలియాడుతుండగా జాలర్లు వచ్చి కాపాడినట్టు లక్ష్మి తెలిపింది.

లక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే గుడివాడ
రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూసాల లక్ష్మిని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం పరామర్శించారు. నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు కూడా లక్ష్మిని పరామర్శించారు. 

గోదారమ్మ..నా పిల్లలెక్కడమ్మా..?
ఆరిలోవ(విశాఖ తూర్పు): గోదావరిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన అప్పలనరసమ్మ మృతదేహానికి ఆరిలోవలో సోమవారం అంత్యక్రియలు జరి గాయి. విశాఖ నుంచి ఆరిలోవ ప్రాంతం దుర్గాబజార్‌కు చెందిన ఆమె తన ఇద్దరు మనవరాళ్లును తీసుకొని బంధువులతో కలసి పాపికొండలు యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె ఇద్దరు మనవరాళ్లు వైష్ణవి, అనన్య గల్లంతయ్యారు. బోటు ప్రమాదంలో ఆరిలోవకు చెం దిన ముగ్గురు గల్లంతు కావడంతో చినగదిలి తహసీల్దారు ఆర్‌.నర్సింహమూర్తి, సిబ్బంది ఆదివారం సాయంత్రమే రాజమండ్రి చేరుకొన్నారు. అక్కడ అప్పలనరసమ్మ మృతదేహం ఆదివారం రాత్రి లభ్యంకావడంతో అంబులెన్స్‌లో ఆరిలోవ  చేర్చారు. తల్లి మృతదేహాన్ని చూసి కొడుకు అప్పలరాజు, కోడలు భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నా బంగారు కొండలైనా క్షేమంగా ఉన్నారా అమ్మా అంటూ అప్పలరాజు విలపించాడు. ఇద్దరు పిల్లలూ గల్లంతయ్యారన్న షాక్‌లో భాగ్యలక్ష్మి విలపిస్తోంది. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ కారణంగానే ఏడాది వయసున్న చిన్నారి అనన్యని తల్లి పాలు మాన్పించాలని భావించారు. ఈ నిర్ణయమే ఆ చిన్నారుల పాలిట మృత్యు గీతంగా మారింది. అత్తమ్మని పొట్టన పెట్టుకున్నావ్‌ గోదారమ్మ తల్లీ.. నా  పిల్లలెక్కడున్నారమ్మా..  నా అనారోగ్యమే వారి పాలిట శాపంగా మారిందంటూ రోదిస్తున్న భాగ్యలక్ష్మిని ఓదార్చడం ఎవ్వరితరమూ కాలేదు.

బాధితులకు ఎంపీ ఎంవీవీ పరామర్శ..
అప్పలనరసమ్మ మృతి వార్త వినగానే స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు విషాదం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చిన్నారులు, తల్లిని కోల్పోయిన అప్పలరాజు, భాగ్యలక్ష్మిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం తొందరలోనే అందిస్తామని, తన వంతు సహకారం అందిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్‌.వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల  పరామర్శించి ఓదార్చారు. పెద్ద కుమారుడు అప్పలరాజు తల్లికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.

అమ్మా మాట్లాడమ్మా.. చెల్లి ఎక్కడుందమ్మా..?
పెందుర్తి: ‘అమ్మా లెగమ్మా.. మాట్లాడమ్మా.. నా చెల్లెలు ఏదమ్మా.. ఇప్పుడు నాకు తోడెవరమ్మా.. నెనెవరితో ఆడుకోవాలమ్మా.. ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకోవాలమ్మా.. చెల్లెప్పుడు వస్తాదమ్మా.. మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయావమ్మా.. నాన్నకు నాకు దిక్కెవరమ్మా’ అంటూ వేపగుంటకు చెందిన బొండా లక్ష్మి పెద్దకుమార్తె రమ్య తల్లి మృతదేహం వద్ద విలపించిన తీరు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బొండా లక్ష్మి(37) మృతి చెందింది. ఆమెతోపాటు వెళ్లిన చిన్నకుమార్తె పుష్ప(13) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న బంధువులు లక్ష్మి మృతదేహాన్ని గుర్తించడంతో సోమవారం ఉదయం రామమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో లక్ష్మి మృతదేహాన్ని వేపగుంటకు తరలించారు. శనివారం సాయంత్రం ఇంటిలో అందరికీ జాగ్రత్తలు చెప్పి యాత్రకు బయలుదేరిన లక్ష్మి విగతజీవిగా కనిపించడంతో భర్త శంకరరావు, పెద్ద కుమార్తె రమ్య తల్లడిల్లిపోయారు. లక్ష్మి అత్తామామ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు లక్ష్మి మృతదేహం వద్ద బోరున విలపించారు. శంకర్, రమ్యలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వేపగుంట శ్మశానవాటికలో లక్ష్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ లక్ష్మి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు.

మాకు దిక్కెవరమ్మా.. 
మధ్య తరగతి కుటుంబానికి చెందిన బొండా శంకరరావు, లక్ష్మి దంపతులు ఇద్దరు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. శంకర్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమార్తె రమ్య తొమ్మిదో తరగతి కాగా.. చిన్న కుమార్తె పుష్ప ఎనిమిదో తరగతి చదువుతుంది. రమణబాబు కటుంబంతో కలిసి ఆదివారం వేకువజామున రాజమండ్రి రైలులో చేరుకుని బోటు షికారుకు విశిష్ట బోటు ఎక్కారు. ఆ బోటు ప్రమాదంలో మధుపాడ రమణబాబు కుటుంబసభ్యులు సహా లక్ష్మి, పుష్ప గల్లంతయ్యారు. లక్ష్మి మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తించారు. ఇంకా పుష్ప ఆచూకీ లభించలేదు. ఓ వైపు లక్ష్మి మృతి.. మరోవైపు పుష్ప గల్లంతు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరంటూ శంకర్, రమ్య రోదిస్తున్నారు. ఈ ఘటనతో వేపగుంటలో తీవ్ర విషాదం అలముకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement