
సాక్షి, కడప: తాగిన మైకంలో అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అని ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ కారణంగా ఓ వ్యక్తి బావిలో పడ్డాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు బావి గట్టున కూర్చోని మద్యంగా సేవించారు. తాగిన మైకంలో వీరిద్దరూ దేవుడి గురించి చర్చించుకున్నారు. కిషోర్ నాయక్ దేవుడు ఉన్నాడని వాదించడంతో రామాంజనేయులు లేడని వాదించాడు. వీరి వాదనలు తారస్థాయికి చేరాయి.
ఇక కిషోర్ నాయక్ తాగిన మైకంలో పక్కనే ఉన్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుందని ఆమెను చూపిస్తాని బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బావిలో ఉన్న ఓ రాయిపై కిషోర్ నాయక్ కాలు వేయటంతో ఆ రాయి విరిగి సుమారు 70 అడుగుల లోతున పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన రెండో వ్యక్తి స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బావిలో పడ్డ వ్యక్తిని రక్షించారు. అనంతరం కిషోర్ నాయక్‌ను ఆస్పత్రికి తరలించారు.