దొండపాడు (వినుకొండ రూరల్), న్యూస్‌లైన్: సంక్రాంతి పండగను మనుమలు, మనవరాళ్లతో సంతోషంగా గడుపుకోవాలనుకున్న ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు మనవరాళ్లు ఒకేసారి మృత్యువాత పడడంతో ఆ వృద్దులు ఖిన్నులయ్యారు. దొండపాడు పంచాయలోని చేపల చెరువులో ప్రమాదవశాత్తు పడి వరసకు అక్కాచెల్లెళ్లు చెంబేటి శిరీషా (12), తిరువీధుల వెంకటేశ్వరి (3)లు మృతిచెందగా.. మరో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చేజర్లకు చెందిన చలంచర్ల లక్ష్మయ్య, దేవమ్మ దంపతులు దొండపాడు శివారు పానకాలపాలెం చేపల కుంటలకు కాపలాదారులుగా పనిచేస్తున్నారు.
వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమారుడి కొడుకు దుర్గాప్రసాద్ తాతయ్య, నాయనమ్మల వద్ద ఉంటున్నాడు. లక్ష్మయ్య కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో చేపల చెరువులకు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. లక్ష్మయ్య కుటుంబ సభ్యులందరూ దొండపాడులో సంక్రాంతి పండగను జరుపుకుందామనుకున్నారు. లక్ష్మయ్య పెద్దమనమరాలు శిరిషా, చిన్నకుమార్తె జ్యోతి, మనవరాలు వెంకటేశ్వరి వారంరోజుల ముందుగా దొండపాడు చేరుకున్నారు. సోమవారం ఉదయం పండగ సరుకుల నిమిత్తం దేవమ్మ, జ్యోతి వినుకొండ వెళ్లారు.
కట్టెలు తేవడానికి లక్ష్మయ్య సమీప ముళ్ల కంప పొదల్లోకి వెళ్లాడు. ఇంటి వద్దనే ఉంటున్న దుర్గాప్రసాద్, శిరీషా, వెంకటేశ్వరిలు చేపల చెరువులో వాలుతున్న పక్షులను పట్టుకుందామని ఒడ్డున ఉన్న పడవలో చెరువు మధ్యకు వెళ్లారు. ఇంతలో పడవలో ఉన్న వెంకటేశ్వరి అదుపు తప్పి చెరువులో పడిపోయింది. చెల్లెలను కాపాడేందుకు శిరీషా నీళ్లలోకి దూకింది. లోతు ఎక్కువ ఉండడంతో ఈతరాక ఇద్దరు బాలికలు మృతిచెందారు. లక్ష్మయ్య కట్టెలు తెచ్చేసరికి చెరువు మధ్యలో పడవలో ఏడుస్తూ ఉన్న దుర్గాప్రసాద్ కంటపడ్డాడు.
దీంతో కంగారుపడిన లక్ష్మయ్య సమీప వ్యవసాయ పొలాల్లోని రైతుల సహాయంతో పడవను ఒడ్డుకు చేర్చి విషయం తెలుసుకుని కుప్పకూలిపోయాడు. వినుకొండ నుంచి పండగ సరుకులతో ఇంటికి చేరుకున్న జ్యోతి తన ఒక్కగానొక్క కుమార్తె మృత్యువాత పడిందని తెలుసుకుని స్పృహ కోల్పోయింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో మునిగి ఇద్దరు బాలికల మృతి
Published Tue, Jan 14 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement