సాక్షి, విశాఖపట్నం/ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని హతమార్చడానికి పక్కా పథకాన్ని రచించారన్న వాదనలకు లభిస్తున్న ఆధారాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. జగన్‌ను కత్తితో పొడిచిన జనుపూడి శ్రీనివాసరావు ఉంటున్న ఇల్లు ఎయిర్‌పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉంది. విమానాశ్రయం ఎదురుగా ఉన్న విమాననగర్ రెండో లైన్‌లోని శాంతినివాస్ రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో శ్రీనివాసరావు ఉంటున్నాడు.
అతనితో పాటు రాజు అనే వ్యక్తి, మరో యువకుడు, ఇద్దరు యువతులు (ప్రత్యేకంగా ఉన్న గదిలో) మొత్తం ఐదుగురు ఉండేవారు. వీరిలో రాజుతో శ్రీనివాసరావు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. వీరంతా ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్‌లోనే పనిచేస్తున్నారు. ఇంతలో ఈ నెల 20న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన నరేష్ కుష్వా, భరత్‌సింగ్ అనే ఇద్దరిని (వరుసకు అన్నదమ్ములు) ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పనిచేయడానికి హర్షవర్థన్ విశాఖ రప్పించారు. గతంలో వీరిద్దరు ఇదే రెస్టారెంట్‌లో కుక్, సహాయ కుక్‌లుగా పనిచేసి ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్‌కు వెళ్లిపోయారు.
గతం కంటే ఎక్కువ జీతం (నెలకు రూ.18 వేలు) ఇస్తామంటూ హర్షవర్థన్ పలుమార్లు ఫోన్లు చేయడంతో వీరు విశాఖ వచ్చారు. తాము విశాఖ వచ్చే సరికి ఇప్పుడు ఉంటున్న గదిలో శ్రీనివాసరావు, రాజు, మరో వ్యక్తి ఉంటున్నారని, ఇద్దరు యువతులు అంతకు కొద్దిరోజుల ముందే వెళ్లిపోయారని నరేష్ కుష్వా ‘సాక్షి’కి చెప్పాడు. జనవరిలో తాము గ్వాలియర్ వెళ్లిపోయే సమయానికి శ్రీనివాసరావు ఇక్కడకు రాలేదన్నాడు. తాము వచ్చి ఐదు రోజులే కావడంతో శ్రీనివాసరావుతో తమకు అంతగా పరిచయం లేదని, బయట చలాకీగా ఉన్నా తమతో ముభావంగానే ఉండేవాడని వివరించాడు.
పథకంలో భాగంగానే రప్పించారా?
జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యకు కుట్ర పన్నిన నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావు జైలు కెళ్లడం ఖాయమన్న ఉద్దేశంతోనే గ్వాలియర్ నుంచి ఇద్దరు కుక్‌లను ముందస్తుగా రప్పించి, రెస్టారెంట్ నడవడానికి ఇబ్బంది కలగకుండా వ్యూహం పన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ సన్నిహితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి మూడో వ్యక్తితో పాటు కొద్దిరోజుల క్రితం వరకు అదే ఫ్లాట్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలు ఏమయ్యారు? ఎక్కడున్నారన్న దానిపై స్పష్టత లేదు. కనిపించకుండా పోయిన ఇద్దరు అమ్మాయిల దుస్తులు ఇప్పటికీ శ్రీనివాసరావు ఉంటున్న ఫ్లాట్‌లోనే ఉన్నాయి.
ఆ ఇద్దరినీ విచారించిన పోలీసులు
శ్రీనివాసరావు ఉంటున్న శాంతినివాస్ ఫ్లాట్‌కు శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు కొందరు వెళ్లారు. ఫ్లాట్‌లో ఉంటున్న గ్వాలియర్‌కు చెందిన ఇద్దరు కుక్‌లను విచారించారు. శ్రీనివాసరావుతో వారికున్న సంబంధాలు, పరిచయాలపై ఆరా తీశారు. తాము ఇటీవలే ఇక్కడకు వచ్చామని, శ్రీనివాసరావు గురించి తమకేమీ తెలియదని చెప్పిన విషయాలను నమోదు చేసుకుని పోలీసులు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment