అంతా ఆ లేఖలో చెప్పాను | Srinivas Rao comments on Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

అంతా ఆ లేఖలో చెప్పాను

Published Mon, Oct 29 2018 3:54 AM | Last Updated on Mon, Oct 29 2018 7:17 AM

Srinivas Rao comments on Murder Attempt On YS Jagan - Sakshi

సెంట్రల్‌ జైల్‌ నుంచి నిందితుడు శ్రీనివాసరావును తీసుకొస్తున్న పోలీస్‌ సిబ్బంది

సాక్షి, విశాఖపట్నం, ఆరిలోవ, ఎన్‌ఎడీ జంక్షన్‌: ‘చెప్పాల్సిందంతా లేఖలో చెప్పా. కొత్తగా చెప్పడానికి నా దగ్గరేం లేదు. అంతా ఆ లేఖలోనే ఉంది..’ అంటూ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు పోలీస్‌ కస్టడీలో తడుము కోకుండా సమాధానాలు చెప్పాడు. ఏ ప్రశ్న అడిగినా ఇదే విషయాన్ని వల్లె వేశాడు. పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నప్పుడు ఏమాత్రం జంకు లేకుండా ఆద్యంతం నవ్వుతూ కనిపించాడు. కస్టడీకి తీసుకున్న నిందితుడిని తొలి రోజు ఆదివారం విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా, సిట్‌కు సారథ్యం వహిస్తున్న ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. మ«.12 గంటలకు ప్రారంభమైన విచారణ ఏకబికిన రా. 8 గంటల వరకు సాగింది.

నిందితుడి ప్రవర్తనపై ఆరా
ఫ్యూజన్‌ రెస్టారెంట్‌లో శ్రీనివాసరావుతో కలిసి పనిచేస్తున్న మరో ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు సిబ్బందిని ఒకేసారి స్టేషన్‌కు రప్పించారు. శ్రీనివాసరావు ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు?  డ్యూటీ సమయంలో సహచర సిబ్బందితో, ప్రయాణికులతో ఎలా ఉండేవాడు.. డ్యూటీ అయిన తర్వాత ఎలా ఉండేవాడు ? ఏ విధంగా బిహేవ్‌ చేసేవాడు? అతని ఆలోచన విధానం, బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉండేది? ఎటువంటి పుస్తకాలు చదివేవాడు? అందరూ కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లేవారా? స్వగ్రామం, కుటుంబ సభ్యుల వివరాలను ఏమైనా చెప్పేవాడా? తదితర విషయాలపై ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.

ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరిని రాత్రి ఏడు గంటల సమయంలో స్టేషన్‌కు పిలిపించారు. ‘శ్రీనివాసరావును నీకు ఎవరు పరిచయం చేశారు? ఎప్పుడు, ఎక్కడ పరిచయం చేశారు? పనిలో ఎలా పెట్టుకున్నారు? ఎవరైనా సిఫార్సు చేశారా? ఎప్పుడు పనిలో పెట్టుకున్నారు? డ్యూటీ సమయంలో ఎలా ఉండేవాడు ?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. దీనికి ఆయన బదులిస్తూ.. బెంగళూరు, హైదరాబాద్‌ రెస్టారెంట్‌లలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పడంతో పనిలో పెట్టుకున్నానని బదులిచ్చినట్టు తెలిసింది. హర్షవర్ధన్‌ను, నిందితుడిని తొలుత వేర్వేరు రూమ్‌లలో విచారించిన సీపీ, ఏసీపీలు ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ముఖాముఖి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. మరో వైపు నిందితునితో సహా అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలపై, ఫోన్‌కాల్స్‌పై దృష్టి పెట్టారు.  

రమాదేవిని ప్రశ్నించిన సీపీ, ఏసీపీలు
వైఎస్‌ జగన్‌కు కాఫీ సర్వ్‌ చేసిన శ్రీనివాసరావు సహచర ఉద్యోగి రమాదేవితోపాటు అతని స్నేహితునిగా చెబుతున్న రేవతిపతి, లేఖ రాసిందని చెబుతున్న అతని సోదరి విజయదుర్గ, ఫ్లెక్సీ తయారు చేసిన గిడ్డి చైతన్యలను శనివారమే అదుపులోకి తీసుకున్నారు. వీరిని తొలుత వేరే గదిలో ఉంచి ఒక్కొక్కరిగా, అనంతరం నిందితుడి ఎదురుగా తీసుకెళ్లి విచారించారు. ‘ఘటన జరిగిన రోజున నీతో పాటు శ్రీనివాసరావును ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లమని చెప్పారా? అతను నీతో వచ్చేటప్పుడు అతని వెంట ఆయుధాలు తీసుకురావడం నువ్వు చూశావా? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అటాక్‌ చేసే విషయాన్ని ముందుగా నీతో ఏమైనా చర్చించాడా?’ అంటూ వరుసగా రమాదేవిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నాతో ఏమీ చెప్పలేదు.. జగన్‌ను చూడాలని ఉంది.. నీతో వస్తా తీసుకెళ్లమని బతిమలాడితేనే నా వెంట తీసుకెళ్లాను’ అని రమాదేవి బదులిచ్చినట్టు సమాచారం. అతను హత్యాయత్నానికి పాల్పడతాడని తాను ఊహించలేదని ఆమె పేర్కొన్నట్టు చెబుతున్నారు. తనవెంట వచ్చేటప్పుడు అతని జేబులో ఆ లేఖ ఉందోలేదో చూడలేదని, పైగా ఆ లేఖ ప్రస్తావన కూడా తన వద్ద తేలేదని రమాదేవి చెప్పినట్టు సమాచారం. ఆ లేఖ తాను రాయలేదని, అప్పటికే అతను రాసి ఉన్న మేటర్‌ను అందంగా రాసి ఇవ్వమన్నాడని, దాన్ని జగన్‌కు అందజేస్తానని చెప్పుకొచ్చాడని అందుకే తాను రాశానని విజయదుర్గ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. తొమ్మిది పేజీల లేఖలో ఉన్న దస్తూరిని విజయదుర్గ దస్తూరితో, మిగిలిన రెండు పేజీల దస్తూరిని రేపతిపతి దస్తూరితో సరిపోయిందా లేదా అని పరిశీలించారు. 

నిందితుడు విచారణకు సహకరించడం లేదు : సీపీ
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్ర కోణంపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని, అయితే నిందితుడు విచారణకు సహకరించడం లేదని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా అన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును తొలిరోజు ఆదివారం విచారించాక ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆయన కేసు పురోగతిని మీడియాకు వివరించారు. విచారణకు నిందితుడు శ్రీనివాసరావు ఏమాత్రం సహకరించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆ లేఖలో చెప్పాను కదా.. అంటూ బదులిస్తున్నాడని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీపీ ఇంకేం చెప్పారంటే.. 

ఆయుధాలను కిచెన్‌లో దాచాడు
‘జనవరిలో కోడి పందాల సీజన్‌లోనే ఆయుధాలను తీసుకొచ్చి ఎయిర్‌పోర్టులోని కిచెన్‌లో దాచాడు. అప్పుడు ఎందుకు తీసుకొచ్చావని అడిగితే చెప్పడం లేదు. ఇప్పటి వరకు 10, 12 మందిని విచారించాం. నిందితునికి విజయా బ్యాంకు, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. వాటి లావాదేవీలపై సోమవారం విచారణ సాగిస్తాం. ఏడాదిలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చాడు. వీటిలో నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. ఏడాదిగా వేలాది కాల్స్‌ మాట్లాడాడు. వీటిలో ఎక్కువగా బంధువులు, స్నేహితులు, సహచర సిబ్బందితోనే మాట్లాడినవి ఉన్నట్టుగా గుర్తించాం. మిగిలిన కాల్స్‌పై కూడా లోతైన విచారణ జరుపుతున్నాం. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ పిలిపించి విచారిస్తాం. గన్నవరానికి చెందిన లేపాక్షి ఫ్లెక్సీలో డిసెంబర్‌ 29న ఫ్లెక్సీకి ఆర్డర్‌ ఇచ్చాడు. జగన్‌ గారిది, తనది మాత్రమే ఫొటోలు ఉండాలని, ఎవరూ ఉండ కూడదని చెప్పి తయారు చేయించాడు.

ఆరోజంతా అక్కడే ఉండి డ్రాప్ట్‌ చూసిన తర్వాత çఫ్లవర్స్‌ లేకపోతే పెట్టించి ఫ్లెక్సీ వేయించుకుని రూ.1800 ఇచ్చాడు. దాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి రూ.500 ఇచ్చి ఫ్రేమ్‌ తయారు చేయించి 31వ తేదీ రాత్రి 11.30 గంటలకు పెట్టించాడు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టు వైద్యురాలు స్వాతి 0.5 సెంటిమీటర్‌ లోతు గాయమైనట్టుగా ఫస్ట్‌ఎయిడ్‌ రిపోర్టులో పేర్కొంది. హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన వైద్యులు ఒకటిన్నర సెంటిమీటర్‌ లోతులో గాయమైనట్టుగా చెప్పారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడి వైద్యురాలు తన అభిప్రాయం మాత్రమే చెప్పారు. నిందితుని హ్యాండ్‌ రైటింగ్‌ బాగున్నప్పటికీ ఎందుకు ఇతరులతో లేఖ రాయించాల్సి వచ్చిందో విచారిస్తున్నాం. ఇతని బిహేవియర్, యాటిట్యూడ్‌ తెలుసుకునేందుకు కో వర్కర్స్‌ను విచారిస్తున్నాం. సిట్‌ అధికారి నాగేశ్వరరావును హైదరాబాద్‌ పంపితే స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరించారు. సెక్షన్‌ 160 ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాల్సిందిగా కోరతాం. రేపటి నుంచి విచారణ మరింత వేగవంతం చేస్తాం’ అన్నారు. ఈ సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ ఫకీరప్పా, సిట్‌ చీఫ్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆరు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి
నిందితుడిని విచారించడానికి రెండు వారాలపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు విశాఖపట్నం ఏడవ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ను కోరగా.. ఆరురోజుల పాటు కస్టడీకి ఇస్తూ జడ్జి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జడ్జి ఉత్తర్వులను ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు సిట్‌ బృందం జైలు సూపరింటెండెంట్‌ను కలిసి అందజేసింది. 11.15 గంటల సమయంలో కస్టడీకి అప్పగించిన శ్రీనివాసరావును ప్రత్యేక పోలీస్‌ బందోబస్తు మధ్య నేరుగా ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు 11.45 గంటలకు తీసుకొచ్చారు. శ్రీనివాసరావుకు ఈ నెల 26న కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కేంద్ర కారాగారంలో ప్రత్యేక గదిలో ఉంచారు. ఇతర ఖైదీలెవ్వరితో మాట్లాడనివ్వలేదు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం మధ్యలో మీడియా ప్రతినిధులను దారిమళ్లిస్తూ భారీ బందోబస్తు మధ్య శ్రీనివాసరావును జైలు నుంచి ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. జైలు నుంచి తీసుకెళ్తుండగా నిందితుడు శ్రీనివాసరావు మీడియా వాహనాలను గమనిస్తూ నవ్వుతుండటం మీడియా ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement