విగ్రహ ప్రతిష్ఠకు వెళ్లి.. పైలోకాలకు..
► చిగురుకోటలో విషాదం
► ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో బాణసంచా పేలుడు
► గుండెపోటుతో ఇద్దరి మృతి
చిన్నప్పుడే ఉన్న ఊరు వదిలి వచ్చేశారు. విజయవాడ, గుంటూరులో స్థిరపడ్డారు. సొంత ఊరిలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. ఆనందంతో పాల్గొన్నారు. దేవుడి చూద్దామని వచ్చి శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయారు. ఆధ్యాత్మిక వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ముదినేపల్లి మండలం చిగురుకోటలో బాణసంచా పేలి గుండెపోటుతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇది.
ముదినేపల్లి రూరల్ : మండలంలోని చిగురుకోటలో శుక్రవారం జరిగిన బాణసంచా పేలుడు కారణంగా ఇద్దరు మృతి చెందారు. గ్రామసెంటర్లో రూ.50 లక్షల వ్యయంతో వీరాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మించారు. శుక్రవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాణసంచా కాల్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి ఎదురుగా ఒక మినీ వ్యానులో బాణాసంచా తారాజువ్వలు వేస్తున్నారు.
ఒక తారాజువ్వ వ్యానులో ఉన్న బాణాసంచాపై పడడంతో ఒక్కసారిగా అంటుకుని విపరీతమైన శబ్ధంతో మంటలు పైకెగిసాయి. ప్రతిష్ఠకు హాజరైన భక్తులంతా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక పరుగులు తీశారు. పేలుళ్లతో ఆ ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి వచ్చిన పిట్టా మల్లికార్జునరావు(33),గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లికి చెందిన టి.సుబ్బారావు(32) పేలుళ్ల ధాటికి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరావు స్పృహతప్పి పడిపోయాడు. పరసా ఆదినారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.
మృతి చెందిన మల్లికార్జునరావు కుటుంబం చిగురుకోట నుంచి వెళ్లిపోయి విజయవాడలో స్థిరపడింది. ప్రతిష్ఠ సందర్భంగా గ్రామానికి వచ్చాడు.మరో మృతుడు సుబ్బారావు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిష్ఠ సందర్భంగా గ్రామంలో జరిగే సాంఘిక నాటిక నటులకు డ్యాన్స్ నేర్పేందుకు వచ్చి మృత్యువాత పడ్డాడు. గుడివాడ డీఎస్పీ వై.అంకినీడు ప్రసాద్, రూరల్ సీఐ యూ.వి.శివాజీ రావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
మృతుల్లో ఒకరైన మల్లికార్జునరావు మృతదేహం ముందుగానే విజయవాడకు తరలించారు. సుబ్బారావు మృతదేహాన్ని మాత్రమే పోలీసు అధికారులు పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో గుండెపోటుతో మరణించినట్లుగా నిర్థారణకు వచ్చారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించి డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చర్యలు తీసుకుంటాం