వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి
Published Fri, Aug 30 2013 5:05 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, టెక్కలి రూరల్, న్యూస్‌లైన్: శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ఘటనలో విద్యార్థి నగరాపు మధు (20), టెక్కలిలో లారీ ఢీకొని గొర్లె నాగేంద్రబాబు(18) మృతిచెందారు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... గృహప్రవేశానికి హాజరుకావడానికి మండల వీధి నుంచి దండి వీధికి ఆటోలో మధు అతని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నాడు. జెడ్పీ కార్యాలయ సమీపంలోకి ఆటో రాగానే ఎదురుగా సైకిల్‌పై వస్తున్న విద్యార్థినిని ఆటో ఢీకొంది. కంగారులో ఆటోడ్రైవర్ దాన్ని పక్కకు తిప్పాడు. దీంతో ఆటో ఓ బండరాయిని ఢీకొని బోల్తా పడింది. ఆటోలో నుంచి మధు తుళ్లి, బయటకు పడిపోయాడు. అతని తల రాయికి బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
కళ్లెదుటే అనంత లోకాలకు
ఐటీడీఏలో పనిచేస్తున్న బాబూరావు దంపతులకు మధు ఒక్కడే కుమారుడు. ఇద్దరు కుమార్తెలకూ వివాహాలు చేసి కుమారుడ్ని శ్రీకాకుళం కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నారు. త్వరలో డిగ్రీ పూర్తి చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని భావిస్తుండగా వారి కళ్లెదుటే మధు అనంత లోకాలకు చేరిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరికీ మధ్యలో కూర్చున్న మధు ఏ విధంగా తుళ్లిపోయాడన్నది వారు చెప్పలేక పోతున్నారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. శుభకార్యానికి వెళ్లాల్సిన ఇళ్లు మరో 50 అడుగులు దూరంలో ఉండగానే ఆటో బోల్తాపడడం, అదే సమయంలో మధు కుటుంబం వెళ్లాల్సిన ఇంటి వద్ద అతని తాత ఆటో దిగడం, విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
సైకిల్‌పై వెళ్తుండగా...
జాతీయ రహదారిపై టెక్కలి సమీపంలో జగతి మెట్ట వద్ద డిగ్రీ విద్యార్థి గొర్లె నాగేంద్రబాబు గురువారం లారీ ఢీ కొని మృతి చెందాడు. సైకిల్‌పై కళాశాలకు వెళ్తుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో అటు వైపుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొనడంతో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అధిక రక్తస్రావంతో కొన ఊపిరితో ఉన్న ఆ విద్యార్థిని వైఎస్సార్ సీపీ నాయకులు కోత మురళీధర్, చింతాడ గణపతి తదితరులు సహాయక చర్యలు చేపట్టి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆ విద్యార్థి మృతి చెందాడు. పూర్తి వివరాలిలా ఉన్నాయి... టెక్కలి ఎన్‌టీఆర్ కాలనీకు చెందిన గొర్లె గౌరీశంకర్, రాజేశ్వరీల కుమారుడు నాగేంద్రబాబు టెక్కలి సమీపంలోని బీఎస్‌అండ్‌జేఆర్ కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
గురువారం మధ్యాహ్నం సైకిల్‌పై కళాశాలకు వెళ్తుండగా, జగతిమెట్ట సమీపంలో రోడ్డు దాటుతున్న సమయంలో అటు వైపుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొని వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ రాంబాబు, ఎస్సై శంకరరావులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, లారీను వెంబడించి పట్టుకున్నారు. ఇదే సమయంలో అటు వైపుగా వస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు గాయాలపాలైన విద్యార్థిని టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు. అయితే విద్యార్థి మృతి చెందినట్టు వైద్యుడు చక్రవర్తి నిర్ధారించారు. ఈ సంఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అండగా నిలుస్తాడనుకుంటే...
కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ నాగేంద్రబాబు తల్లి రాజేశ్వరి ఆస్పత్రి వద్ద భోరున విలపించింది. ఇంటికి కుమారుడైన నాగేంద్రబాబును బాగా చదివించాలనుకున్న తమకు విధి వెక్కిరించిందంటూ ఆమె కన్నీరుమున్నీరైంది. నాగేంద్రబాబు మృతితో పట్టణంలో విషాద చాయలు అలముకున్నాయి. విద్యార్థి మృతి పట్ల బీఎస్‌అండ్ జేఆర్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు దిగ్భ్రాంతి చెంది, సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement