కొత్తపాలెం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాలు
సాక్షి, నరసరావుపేట : ఒకే గ్రామం.. కానీ రెండు నియోజకవర్గాలు. ఎదురెదురు ఇళ్లలోని వారు ఓటు వేసేది మాత్రం వేర్వేరు అభ్యర్థులకు. ఇటువంటి చిత్రమైన పరిస్థితి నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల సరిహద్దులోని రెండు గ్రామాల్లో నెలకొంది. కోటప్పకొండ సమీపంలోని యక్కలవారిపాలెం, కట్టుబడివారిపాలెం గ్రామాలు పేరుకే రెండు గ్రామాలు.
ఒకే గ్రామంగా కలిసి ఉంటాయి. కేవలం రెండు గ్రామాలను విడదీసేది ఒక రోడ్డు మాత్రమే. రోడ్డుకు తూర్పున నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కట్టుబడివారిపాలెం ఉండగా, పశ్చిమాన నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని యక్కలవారిపాలెం గ్రామం ఉంది. ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల నాయకులు గ్రామాన్ని రెండు గ్రామాలుగా విడదీస్తున్న ఒకే మెయిన్‌రోడ్డుపై ప్రచారం చేస్తుంటారు.
కొత్తపాలెం పరిస్థితి ఇదే..
కొత్తపాలెం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నరసరావుపేట మండలంలోని కొత్తపాలెం, చిలకలూరిపేట మండల పరిధిలోకి వచ్చే అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాలు రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాలను కూడా విడదీసేది ఒకే రోడ్డు. రోడ్డుకు ఒక వైపు ఆమీన్‌సాహెబ్‌పాలెం(అవిశాయపాలెం), రెండో వైపు కొత్తపాలెం గ్రామాలున్నాయి. మిగిలిన సమయంలో రెండు గ్రామాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవి రెండు గ్రామాలని చెబితేగానీ తెలియదు. ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ఓటర్లు తమ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల అభ్యర్థులకు ఓటు వేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment