ఓటేయకపోతే ఊరుకునేదిలేదు ! | TDP Leaders Are Threatening People To Vote For Us | Sakshi
Sakshi News home page

ఓటేయకపోతే ఊరుకునేదిలేదు !

Published Thu, Apr 11 2019 9:45 AM | Last Updated on Thu, Apr 11 2019 11:22 AM

TDP Leaders Are Threatening People To Vote For Us - Sakshi

సాక్షి, గుంటూరు : ‘ఓటు వేస్తే మాకే వేయాలి.. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదు.. మాకు ఓటు వేయకపోతే ఊర్లో నుంచి వెళ్లగొడతాం.. మమ్మల్ని ఎదురించేంత ధైర్యం ఎవరిచ్చార్రా.. బతకాలని లేదా?’ అంటూ టీడీపీ నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని మంగళగిరి, గురజాల,  సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ వంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.

కులం పేరుతో దూషిస్తూ... ‘మీరు కూడా మాకు ఎదురు తిరిగేంత మనగాళ్లు అయ్యారా.. ఎన్నికలయ్యాక ఓట్లు తక్కువ వస్తే మీ అంతు తేలుస్తాం’ అంటూ టీడీపీకి మద్దతుగా ఉండే బలమైన సామాజికవర్గం నేతలు ఇతర సామాజికవర్గాల ప్రజల్ని నయానోభయానో తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో రాత్రి వేళల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు నివాసాలు ఉండే కాలనీలకు వెళ్లి నానా యాగి చేస్తున్నారు.

వీరి బెదిరింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న వారు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. దీంతో ‘మాపైనే కేసులు పెడతారా ?’  అంటూ టీడీపీ నేతలు బాధితుల ఇంటిని ముట్టడించి నానా దుర్భాషలాడుతూ వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.  

పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం 
గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఓటమి భయంతో వైఎస్సార్‌ సీపీకి వెన్నుదన్నుగా నిలిచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఓటు తమకు వేసే ఉద్దేశం ఉంటేనే పోలింగ్‌ కేంద్రానికి రావాలని, అలాకాని పక్షంలో వేయకుండా ఇంట్లోనే కూర్చొవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.

ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని గురజాల, సత్తెనపల్లి,  నరసరావుపేట, వినుకొండతోపాటు మంగళగిరి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే గొడవలకు దిగుతూ శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసులు కూడా నమోదు చేయని పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో అధికారులంతా అధికార పార్టీ నేతలు తెచ్చుకున్నవారే కావడంతో వారు చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

కులం పేరుతో దూషణలు 
గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ కాలనికి వెళ్లిన టీడీపీ నేతలు సోమవారం రాత్రి వారికి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేశారు. అయితే, తాము డబ్బు తీసుకోబోమని, ఎన్నికల్లో తమకు ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకుంటామంటూ చెప్పడంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ కొల్లి కృష్ణతోపాటు, మరికొందరు ఎస్సీలపై దౌర్జన్యానికి దిగడంతో వీరంతా వెళ్లి పోలీసులకు íఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రెండు రోజులు గడుస్తున్నా కేసు కూడా నమోదు చేయకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లికు తలొగ్గి పనిచేస్తున్న దయనీయ పరిస్థితి. 

ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం 
గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో టీడీపీ నేతల ముస్లిం మైనార్టీ వర్గం నివాసం ఉండే ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం నేతలు రెచ్చిపోయారు. ‘మీరు రేపు ఓట్లు ఎలా వేస్తారో చూస్తాం.. మాకు ఎదురు తిరిగే మొగాళ్లు  అయ్యారా.. ఇళ్లు పీక్కొని ఊరి నుంచి వెళ్లిపోవాల్రా ’ అంటూ మహిళలను సైతం  తీవ్ర స్థాయిలో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దాచేపల్లి పోలీసులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన టీడీపీ నేతలు ‘మాపైనే కేసులు పెట్టేంత మొనగాళ్ళు అయ్యారా’ అంటూ తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ బాధితుల ఇంటి ముందు హల్‌చల్‌ చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం కనీసం పట్టించుకున్న  దాఖలాలు లేవంటే అధికార పార్టీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.    

మంగళగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
పల్నాడులో పరిస్థితి ఇలా ఉంటే ..రాజధాని నియోజకవర్గమైన మంగళగిరిలో సైతం టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు.  ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రజల నుంచి పెద్ద ఆదరణ లభిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలను ఓటమి భయం వెంటాడుతోంది.

పార్టీ అధినేత తనయుడు ఓటమిపాలైతే పరువు పోతుందనే భయంతో బీసీ సామాజిక వర్గాలను టార్గెట్‌గా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు.  తాజాగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో బీసీ వర్గానికి చెందిన మహిళలపై దౌర్జన్యానికి దిగుతూ టీడీపీకి ఓటు వేయకపోతే చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. 

టీడీపీ నేత గరికపాటి నాని తనను చంపుతామంటూ బెదిరించారంటూ బీసీ మహిళ దేవరాజు పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు టీడీపీ నేతల దౌర్జన్యకాండకు అడ్డుకట్ట వేయకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వీల్లేకుండా పోతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement