⇒ మిర్చి యార్డులో కమీషన్ వ్యాపారుల మాయాజాలం
⇒ అధిక కమీషన్ నొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువ
⇒ రెండేళ్లుగా లెసైన్స్‌లు లేకుండానే వ్యాపారాలు
⇒ శ్యాంపిల్ పేరిట లాట్‌ల నుంచి కిలోల కొద్దీ తీసివేత
పాత గుంటూరు : గుంటూరు మిర్చియార్డులో రైతులు దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు మిర్చిని యార్డుకు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తుంటారు. అమ్మకాల్లో ఏజెంట్లు నూటికి రూ.2 కమీషన్ తీసుకోవాల్సి వుండగా, రూ.3 నుంచి రూ.5.50 వరకు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదే విషయమై రెండు రోజుల కిందట యార్డులో రైతులకు , కమీషన్ వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను యార్డుకు తీసుకువస్తుంటే కమీషన్ వ్యాపారులు మాయ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత కమీషన్ కట్ చేస్తున్నారనే విషయం కూడా తమకు తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
మిర్చిలో తేమ శాతం ఎక్కువగా ఉందని ధర తగ్గిస్తున్నట్టు చెపుతున్నారు. కమీషన్ వ్యాపారులు, కొనుగోలుదారులు ముందుగానే ఒప్పందం ప్రకారం రైతులు తెచ్చిన లాట్‌లకు ధర నిర్ణయిస్తారు. దీనిలో కూడా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సమాచారం. దీనిపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లెసైన్సులు లేకుండానే వ్యాపారం ...
గుంటూరు మార్కెట్ యార్డులో వ్యాపారులు రెండేళ్లుగా లెసైన్సులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. గత ఏడాది సుమారు 500 షాపులకు రెన్యువల్ చేయాల్సి ఉంది. అప్పటి మార్కెట్ యార్డు కమిటీ దృష్టికి 293 షాపులకు సంబంధించి అవకతవకలు ఉన్నాయనిఆరోపణలు రావడంతో రెన్యువల్ చేయకుండా నిలిపివేశారు. ఇప్పటికీ లెసైన్స్‌లు లేకుండానే వ్యాపారం సాగుతోంది.
లాటులో బస్తాలు కట్ చేస్తే తరుగు..
రైతులు యార్డుకు అమ్మకానికి తీసుకువచ్చిన మిర్చిని కొనుగోలుదారులు శ్యాంపిల్ చూస్తామంటూ బస్తాలను మధ్యలో కట్ చేస్తుంటారు. ఈ క్రమంలో కిలో నుంచి రెండు కిలోల వరకు మిర్చిని లాగేసి శ్యాంపిల్ చూస్తారు. ఒక్కో లాట్‌లో నాలుగైదు బస్తాల్లో ఇలా తేడాలు వస్తున్నాయని రైతులు తెలుపుతున్నారు. హమాలీలు కూడా ఆ మిర్చిని వదిలేసి బస్తాలను కుట్టడంతో తరుగు వస్తుందని రైతులు చెపుతున్నారు.
కమీషన్ వ్యాపారులే గ్రామాల్లో కొనుగోళ్లు ...
కమీషన్ వ్యాపారులే స్వయంగా గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కూడా రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యార్డుకు వెళితే బస్తాకు చాలా ఖర్చు అవుతుందని ప్రచారం చేసి స్వయంగా ఏజెంట్లే కొనుగోలు చే సి కమీషన్ వ్యాపారస్తులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. కమీషన్ వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లోనే అమ్మకాలు స్వయంగా ఎగుమతిదారులతో నిర్వహిస్తున్నారు.
ఉన్నత శ్రేణి కార్యదర్శి వివరణ...
యార్డులో అవకతవకలపై యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి రామ్మోహనరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా రైతుల నుంచి అధిక కమీషన్ వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. అధికంగా కమీషన్ తీసుకుంటున్నారని అనుమానం వస్తే రైతులు నిర్భయంగా తనకు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
రైతు కంట్లో కారం..!
Published Tue, Apr 28 2015 3:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement