
రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం: వైఎస్ జగన్
గుంటూరు: రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజురోజుకు రైతులపై రుణభారం పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్ సందర్శించి, మిర్చి రైతులతో ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ వైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు బ్యాంకులు రుణాలు చెల్లించడం లేదంటూ రైతులకు కొత‍్త రుణాలు ఇవ్వడం లేదన్నారు.
ఇక రైతులకు ఇవ్వాల్సిన నాణ్యమైన విత్తనాలను కిలో రూ.లక్ష చొప్పున బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్నారు. మార్కెట్‌లో విచ్చలవిడిగా కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...తక్షణమే మార్క్ ఫెడ్లను రంగంలోకి దించి మిర్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలు పడిపోయినపుడు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు.