ఉగాది చేసుకుంటే మాకు అనర్థమే ...!
► గంగవరదప్ప స్వామి ఆలయానికి ముళ్లకంప .
► రెండు రోజుల పాటు రాగి ముద్ద వేరుశనగ పొడి తినాల్సిందే ..
► స్నానాలు కూడా చేయరాదు .
► కురుబలలో కొంత మందికి ఈ ఆచారాలు తప్పవు .
► ఆచారం అదుపు తప్పితే అపాయమే ..
ఆత్మకూరు: ఉగాది ఈ పండుగ పేరు వింటేనే అన్ని రుచులు కలిపి ఉగాది పచ్చడి చేసుకొని ఆలయాలకు కుటుంబాల సమేతంగా వెళ్లి ఆనందంగా గడుపుతారు . పండుగ వారం రోజులు ఉందనగానే బట్టలు తేవడం, ఇళ్లు శుభ్రం చేసుకొవడం వంటి పనులలో బిజీ బిజీగా గడుపుతారు . కాని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో కురుబలు కొంత మంది ఉగాది పండుగ చేసుకుంటే మాకు అనర్థం తప్పక జరుగుతుందని చెబుతున్నారు.
కొన్ని శతాబ్దాల కాలం నుంచి వస్తున్న వారి ఆచారాన్ని తూచా తప్పకుండా ఇప్పటికి పాటిస్తున్నారు .కురుబలలో కొంత మంది పిల్లల, ఎబ్బిలి, పూజారి వంటి ఇంటి పేర్లు ఉన్న ఎక్కువగా గంగవరదప్ప స్వామిని ఇంటి దైవంగా భావిస్తారు. కాని ఉగాది రెండు రోజులు ఉందనగానే వారు గంగవరదప్ప స్వామి ఆలయానికి ముళ్ల కంప కొట్టి తాళం వేస్తారు . పండుగ ముగిసే వరకు మూడు రోజుల పాటు ఆలయాన్ని తెరవరు.