
రైల్వేజోన్ పట్టని టీడీపీ
కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం శోచనీయం : ఉమ్మారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ కోసం ఒత్తిడి తీసుకురాకపోవడం శోచనీయమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఒడిశాలో రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తోందన్నారు. రైల్వేజోన్ కోసం వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడోరోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు.
అమర్‌నాథ్‌కు సంఘీభావం తెలపడానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖకు వస్తారన్నారు. ఇలా ఉండగా శనివారం రాత్రి కేజీహెచ్ వైద్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ విజయ్‌లు దీక్షా శిబిరానికి వచ్చి అమర్‌నాథ్‌కు వైద్య పరీక్షలు చేశారు. బీపీ 110/70, ఆక్సిజన్ 97, బ్లడ్ షుగర్ 82 మిల్లీగ్రాములు, హార్ట్‌బీట్ 111 ఉందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.