
సాక్షి, గుంటూరు : నరసరావుపేటలోని గురజాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తవాతావరణం నెలకొంది. అక్రమ గునుల పరిశీలనకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందన్నారు. యరపతినేని కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని, అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తుంటే వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకొస్తాయని యరపతినేనికి భయం పట్టుకుందన్నారు. కూలీలు, డ్రైవర్లపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారన్నారు. ఇల్లు, పొలం కూడా లేని వ్యక్తి రూ.80 కోట్ల స్కాం చేస్తాడా అని ధ్వజమెత్తారు. అమాయకులపై కేసులు పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని హైకోర్టు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అమాయకులపై కేసులు పెట్టి యరపతినేని ఈ కేసులనుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్ క్వారీలను తాము పరిశీలిస్తే నిజాలు బయటకోస్తాయని టీడీపీకి భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఖచ్చితంగా అక్రమమైనింగ్ క్వారీలను పరిశీలిస్తామని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసును తప్పుదారిపట్టించాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అక్రమ మైనింగ్ పాల్పడ్డవారు ఎవరైనా శిక్షపడాల్సిందేనన్నారు. నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment