
అయోమయం
=స్పష్టత లేని నగదు బదిలీ -ప్రహసనంగా అమలు
=ఇప్పటి వరకు 24 శాతం నమోదు
=7.17 లక్షల మంది అనుసంధానం చేసుకోవాలి
=లేదంటే నాన్‌సబ్సిడీ గ్యాస్ కొనుగోలు చేయాల్సిందే
జిల్లాలో నగదు బదిలీ పథకం ప్రహసనంగా సాగుతోంది. ఆధార్‌తో అనుసంధానంపై స్పష్టత లేకుండా పోయింది. వారం రోజుల్లో దీనికి గడువు ముగియనుంది. అయినా ఇప్పటి వరకు కేవలం 24 శాతం మంది మాత్రమే గ్యాస్ క నెక్షన్‌ను బ్యాంకు అకౌంట్ అనుసంధానం జరిగింది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నగదుబదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అలా అనుసంధానం చేసుకున్న వారికే సబ్సిడీ సిలెండర్లు లభిస్తాయి. జిల్లాలో 9,44,694 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 24 శాతం మంది మాత్రమే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నారు.
మిగిలిన వారంతా వచ్చే జనవరి ఒకటో తేదీ తరువాత గ్యాస్ బుక్ చేసుకుంటే మార్కెట్ ధర రూ.1077లకు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం సమంజసం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆధార్ లేని వారికి నగదు బదిలీ కోసం వివరాలను సేకరించాలో? లేదో? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. జిల్లాలో 98 శాతం వరకు ఆధార్ నమోదు పూర్తయింది.
నగదు బదిలీకి ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే గడువుంది. ఇంకా సుమారుగా 7.17 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆధార్‌తో సంబంధం లేనప్పటికీ భవిష్యత్తులో మళ్లీ గ్యాస్‌తో అనుసంధానం చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయేమోనన్న సందేహంతో కొంత మంది వినియోగదారులు ఆధార్, బ్యాంకు ఖాతాలను నమోదు చేయించుకుంటున్నారు.
మార్కెట్ ధరకు గ్యాస్
డిసెంబర్ 31వ తేదీలోగా నగదు బదిలీ పథకానికి గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. కానీ కేవలం వారం రోజుల్లో 7.17 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో అనుసంధానం చేసుకోని వారు జనవరి 1వ తేదీ తరువాత గ్యాస్ బుక్ చేసుకుంటే నాన్‌సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే పథకం ద్వారా గ్యాస్‌పై రూ.50 వరకు అదనపు భారం పడుతుండడంతో వినియోగదారులు ఈ పథకంపై ఆసక్తి చూపించడం లేదు. ఈ నెలలో గ్యాస్ బుక్ చేసుకున్న తరువాత అనుసంధానం చేసుకోవాలని కొందరు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా భారీగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. లక్షకు పైగా కనెక్షన్లు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.