సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి బినామీ వ్యవహారాలు బట్టబయలు కావడంతో టీడీపీలో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి అనుయాయుడే డొల్ల కంపెనీల ద్వారా బ్యాంకులకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర ఎగ్గొట్టినట్లు ఈడీ సోదాల్లో వెల్లడికావడం, సుజనాకు నోటీసులివ్వడం, రేపో మాపో అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతుండటం అధికార పార్టీలో ప్రకంపనలు కలిగిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు తెరచాటు వ్యవహారాలను చక్కదిద్దే వ్యక్తిగా, ఆయన తరఫున ఢిల్లీలో చక్రం తిప్పిన సుజనా చౌదరిపై తీవ్రమైన ఆర్థిక ఆరోపణలున్నాయి. మారిషస్‌లో బ్యాంకులో రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో సుజనాపై గతంలో ఈడీ కేసు నమోదై అరెస్టు వారెంటు కూడా జారీ అయింది. విజయ్‌మాల్యా తరహాలో దేశంలోని పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన వ్యవహారంపై సుజనా చౌదరిపై కేసు నమోదై విచారణ జరుగుతోంది.
మోదీ కేబినెట్‌లో తొలి కళంకితుడు!
చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సుజనా చౌదరి ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా ఆర్థిక వ్యవహారాలన్నీ సుజనానే పర్యవేక్షించారని అందువల్లే 2010లో సీనియర్ నాయకులందరినీ పక్కనపెట్టి రాజ్యసభకు పంపారని పార్టీ నేతలే చెబుతున్నారు.
2014లో ఎన్డీఏ అధికారంలో వచ్చాక చంద్రబాబు పట్టుబట్టి మరీ రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో సుజనాకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారు. తీవ్రమైన ఆర్థిక ఆరోపణలున్న వ్యక్తిని కేబినెట్‌లోకి తీసుకోలేనని, ఆయన స్థానంలో మరొకరి పేరు సూచించాలని మోదీ సూచించినా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి మరీ పదవి ఇప్పించారు. దీంతో మోదీ కేబినెట్‌లో తొలి కళంకితుడు సుజనా చౌదరేనని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
సుజనా చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సైతం ఆందోళనలు చేశాయి. చంద్రబాబు ఢిల్లీలో తన ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసమే 2016లో సుజనాను రెండోసారి రాజ్యసభకు పంపారనే ఆరోపణలున్నాయి.
పదేళ్ల నాటి కేసుకు రాజకీయ రంగు..
కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనూ సుజనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సుజనా చౌదరితోపాటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్, పలువురు రాష్ట్ర మంత్రులపై నాలుగున్నరేళ్లుగా లెక్కలేనని అవినీతి ఆరోపణలున్నాయి.
రాజధాని నిర్మాణం, పోలవరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నేరుగా చంద్రబాబుపైనా తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఎదురుదాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపితే తమ అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందనే ప్రచారానికి చంద్రబాబు తెర తీశారనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సీబీఐకి అనుమతిని నిరాకరిస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంటున్నారు. అవినీతి వ్యవహారాలు, ఓటుకు కోట్లు కేసుల భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టి తెలంగాణలో 13 సీట్లతో సర్దుకుని మహాకూటమి ఏర్పాటు చేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పదేళ్ల క్రితం నమోదైన కేసుకు సంబంధించి తాజాగా సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయ కక్షగా ఆరోపణలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment