‘సీఎం తీరు రాజ్యాంగ విరుద్ధం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును తిరిగి పంపించాలని ముఖ్యమంత్రి కిరణ్ నోటీసు ఇవ్వడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధమని తెలంగాణ జేఏసీ విమర్శించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, నేతలు దేవీ ప్రసాద్, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు శనివారంనాడిక్కడ జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై 42 రోజులు చర్చించిన తర్వాత కిరణ్‌కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం, విభజన ప్రక్రియ అంతా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదన్నారు. వారి ప్రకటనలో ముఖ్యాంశాలు...
రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఎం తీరు దేశభద్రతకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
తెలంగాణ మంత్రులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకొని ప్రజల్లో అయోమయం తొలగించాలి.
ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై గౌరవం ఉన్న అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు సీఎం తీరును తప్పుబట్టాలి.
సీఎం కిరణ్ అజ్ఞానం, ఆయనకు రాజ్యాంగంపై ఉన్న చులకనభావం ఈ చర్యతో వెల్లడైంది.
పార్టీల మధ్య అధిపత్య పోరుతో రోజుకో కొత్త నాటకంతో సీఎం కిరణ్ బయటపడుతున్నారు. సీమాంధ్రులు ఈ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేకిస్తున్నారు.