ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏదైనా తేడావస్తే సీమాంధ్ర నాయకులను ఈ ప్రాంతం నుంచి తరిమికొడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఇబ్రహీంపట్నంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని సీఎం పగటి కలలు కంటున్నాడని, కానీ ఏర్పడి తీరుతుందన్నారు. సీఎం కిరణ్ అక్రమంగా మూడు వేల కోట్లు సంపాదించారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దర్యాప్తు జరిపించి జైలుకు పంపిస్తామన్నారు. సీల్డు కవర్ ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని, సీఎం వైఖరి దున్నపోతుపై వానపడ్డట్టు ఉందని అన్నారు. సోనియాగాంధీపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లూ సంయమనంతో వ్యవహరించామని అన్నారు.
టీడీపీకి నూకలు చెల్లాయి...
టీడీపీ మునిగిపోయే పడవని, చంద్ర బాబు అవినీతి గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంద ని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. రెండెకరాల నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని చం ద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే బాబు గులాంగిరీకి స్వస్తి చెప్పాలని కోరా రు. సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌లో కొందరు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడం మాని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఎంపీ సూచించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి గతంలో మలక్‌పేట నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఆయనను, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు.
ఆశించిన అభివృద్ధి ఏదీ?
30 ఏళ్లుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడం వల్ల ఆశించిన అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అసమర్థుడని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా మంచిరెడ్డి గెలుపు నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారిందన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం గా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీని, ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మార్కెట్ కమిటీని ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా దాసరి బాబూరావుతోపాటు పలువురు డెరైక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
తేడా వస్తే తరిమికొడతాం
Published Thu, Jan 2 2014 11:56 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement