మార్గదర్శి కేసు: భారీ జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష! | Undavalli Arun Kumar Explain About Margadarsi Case On Ramoji Rao | Sakshi
Sakshi News home page

కేసులో నేరం రుజువైతే భారీ జరిమానా: ఉండవల్లి

Published Fri, Jan 24 2020 2:28 PM | Last Updated on Fri, Jan 24 2020 2:53 PM

Undavalli Arun Kumar Explain About Margadarsi Case On Ramoji Rao - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కుంభకోణం కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టిసారించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే. అనంతరం మార్గదర్శి కేసుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ కుమార్‌ మీడియా ముందు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఏదో ఒక వంకతో స్టేలు తెచ్చుకొని కేసు నుంచి తప్పించుకోవాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

‘కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా చేయాలన్న మా విజ్ఞప్తిని న్యాయస్థానం స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ.2300 కోట్ల వసూలు చేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనపై వ్యక్తిగతంగా కక్షగట్టారని ఆరోపిస్తూ.. రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజశేఖర్‌రెడ్డి పేరును వాడటానికి వీల్లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరు వాడాలని సూచించింది. అనంతరం కేసుపై న్యాయస్థానం స్టే ఇచ్చింది.(మార్గదర్శి కేసులో సుప్రీం కీలక నిర్ణయం)

హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో సవాలు చేశాము. నేను ఊహించిన దానికంటే సుప్రీంకోర్టు మంచి ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, నాటి విచారణాధికారి కృష్ణంరాజును ఈ పిటిషన్‌లో పార్టీలుగా చేశారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చినని చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలి.

అవిభక్త హిందూ కుటుంబ సంస్థ (హెచ్‌యూఎఫ్‌) అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేశారు. కేసులో దోషిగా తేలితే, రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు భారీ జరిమానా విధిస్తుంది. వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమాన (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉంది. దానితో పాటు రెండున్నరేళ్ల పాటు జైలు శిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయి’ అని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement