మార్గదర్శి కేసులో సుప్రీం కీలక నిర్ణయం | Supreme Court Trial On Margadarsi Chit Pand Case On Undavalli Arunkumar Petition | Sakshi
Sakshi News home page

మార్గదర్శి కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Published Fri, Jan 24 2020 1:00 PM | Last Updated on Fri, Jan 24 2020 1:17 PM

Supreme Court Trial On Margadarsi Chit Pand Case On Undavalli Arunkumar Petition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కుంభకోణం కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చైర్మన్ రామోజీరావును కేసు నుంచి డిశ్చార్జ్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ గతంలో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రిజర్వు బ్యాంకు ప్రత్యేక అధికారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సవరించిన మెమోను దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది. (‘మార్గదర్శి’ కేసులో హైకోర్టు తీర్పుపై అప్పీల్‌)


ఇదీ నేపథ్యం..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం–1934లోని సెక్షన్‌ 45(ఎస్‌) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్న అభియోగంపై ఇదే చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) ఆధారంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చర్యలు తీసుకునేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబర్‌ 19న ఉత్తర్వులు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ జీవో నెంబర్‌ 800 జారీచేసింది.

అలాగే ఈ సంస్థపై ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(టి), సెక్షన్‌ 58(ఇ) కింద చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేసేందుకు అప్పటి సీఐడీ ఐజీ కృష్ణ రాజును జీవో నెంబర్‌ 801 ద్వారా అధీకృత అధికారిగా నియమించింది. ఎన్‌.రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్‌ అడిషనల్‌ చీఫ్‌ మెట్రొపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీసీ నెంబర్‌ 540 దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2010లో ఈ పిటిషన్‌ను ఆ న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరుతూ తిరిగి 2011లో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సీసీ నెంబర్‌ 540లో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇచ్చింది. అయితే ఏ కేసులోనైనా స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని సుప్రీంకోర్టు 2018 మార్చి 28న తీర్పు వెలువరించింది. విచారణ కొనసాగించడం కంటే స్టే పొడిగించడమే అవశ్యమనుకున్న కేసుల్లో స్టే కొనసాగింపునకు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ స్టే పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కానీ స్టే పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ హైకోర్టును ఆశ్రయించింది. 2011లో తాము దాఖలు చేసిన క్రిమినల్‌ పిటిషన్‌ను విచారించాలని అభ్యర్థించింది. దీనిని విచారించిన ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఉన్న క్రిమినల్‌ సీసీ నెంబర్‌ 540ని కొట్టివేసింది. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్‌ ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement