మరికల్, న్యూస్‌లైన్: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద పిల్లకాల్వల ఏర్పాటు కోసం మంగళవారం జరిపిన భూసేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. తక్కువ ధరకే భూములను కొనుగోలు చేస్తున్నారంటూ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మరికల్ శివారులో కోయిల్‌సాగర్ పిల్లకాల్వల కోసం 44 ఎకరాల భూమిని అధికారులు భూసేకరించారు. భూములు కోల్పోయిన రైతుల వివరాలు సేకరించి వారితో భూములు స్వాధీనం చేసుకోవడం కోసం మంగళవా రం పంచాయతీ కార్యాలయంలో రెవె న్యూ అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు.
అయితే గతనెల 17న సమావేశం నిర్వహిస్తామని చెప్పి ఇన్నాళ్లకు భూసేకరణ సమావేశం ఎలా నిర్వహిస్తున్నారని రైతులు వారిని నిలదీశారు. కేఎస్పీ పిల్ల కాల్వలకు తమ భూములు మాత్రం ఇవ్వం.. వాటి నుంచి తమ పొలాలకు ఏమాత్రం ప్రయోజనం లేదని కింది గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపడానికే కాల్వలు తీస్తున్నారని మండిపడ్డారు. భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చిచెప్పారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు తమకు ఇప్పించండి లేదా ఎకరా ఖుష్కి భూమికి రూ. 25 లక్షలు, బోరుబావులున్న ఎకరా భూమికి రూ. 30 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరా ఖుష్కి భూమికి రూ. 1.16 లక్షలు, బోరుబావులు ఉన్న భూమికి రూ. 1.30 లక్షల నష్టపరిహారం ఇస్తామని కోయిల్‌సాగర్ భూసేకరణ డిప్యూటీ తహశీల్దార్ యాదగిరిరావు, జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్‌రెడ్డిలు రైతులకు చెప్పడంతో రైతులు అధికారులను నిలదీస్తూ ఆ నష్టపరిహారం ‘మాకొద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ లేదా రైతుల డిమాండ్ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు రైతులు వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో రైతులు వెంకటేశ్, కొండప్ప, వీరన్న, శ్రీరాములు, మహాదేవమ్మ, వెంకటయ్య, కుర్మన్నలు పాల్గొన్నారు.
‘కోయిల్‌సాగర్’ కాల్వలకు భూములివ్వం
Published Wed, Sep 11 2013 5:17 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement