ప్రజా సంక్షేమమే మా ధ్యేయం.. అభివృద్ధే మా లక్ష్యం అని ప్రగల్భాలు పలికే ప్రజాప్రతినిధులు కొందరు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇవ్వడమే తప్ప వాటి అమలును మరచిపోతున్నారు. పేదల సంక్షేమమే తమ అభిమతం అని వారు చాటుతున్నా..వాస్తవం మరోలా ఉంటోంది. ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అసెన్‌మెంట్ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో భూముల కోసం లబ్ధిదారులు నిరీక్షించాల్సి వస్తోంది.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: జిల్లాలో ఏడో విడత భూ పంపిణీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు మీద ఉత్తర్వులు వస్తున్నాయి. భూమి లేని లబ్ధిదారులను గుర్తించి ..అసైన్‌మెంట్ కమిటీలకు హాజరు కావాలని ఎమ్మెల్యేలకు రెవెన్యూ అధికారులు సమాచారం ఇచ్చినా స్పందన కరువైంది. దీంతో జిల్లాలో ఏడో విడతలో 2852 మందికి భూ పంపిణీ చేయకుండా ఆగిపోయింది. నిరుపేదలకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. ఇప్పటి వరకు జిల్లాలో ఆరు విడతల్లో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చే శారు.
ఇందులో భాగంగానే మొదటి విడతలో 4691 మంది లబ్ధిదారులకు 6636.15 ఎకరాలు, రెండోవిడతలో 3416 మందికి 4034.05 ఎకరాలు పంపిణీ చేశారు. అలాగే మూడో విడతలో 3070 మందికి 4641.20 ఎకరాలు, నాలుగో విడతగా 4596 మందికి 7867.07 ఎకరాలు, ఐదో విడతలో 887 మందికి 1322 ఎకరాలు, ఆరో విడతలో 1201 మందికి 1550.33 ఎకరాలు అందజేశారు. మొత్తం ఆరు విడతల్లో 17861 మందికి గాను 26052 ఎకరాలు పంపిణీ చేశారు. ఏడో విడత నిర్వహించే భూ పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల ఆఖరులోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర భూ పరిపాలన శాఖ కమిషనర్ ఐవైఆర్ కృష్ణారాావు ఆదేశాలు జారీ చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రతీ సారి జిల్లా అధికారులపై ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడంతో పాటు వారికి పంపిణీ చేయాల్సిన భూమి వివరాలు సైతం సేకరించారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అందుకు భూ పంపిణీకి సహకరించడం లేదు. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులు నిర్ణయించిన గడువులోగా భూ పంపిణీ పూర్తి చేయడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఏడో విడతలో మహబూబ్‌నగర్ డివిజన్‌లో 129 మంది లబ్ధిదారులకు 142.32 ఎకరాలు, నారాయణపేట డివిజన్‌లో 902 మంది లబ్ధిదారులకు 1125.38 ఎకరాలు, వనపర్తి డివిజన్‌లో 749 మంది లబ్ధిదారులకు 763.26 ఎకరాలు పంపిణీ చేయాలని అధికార యంత్రాంగం జాబితా సిద్ధం చేసింది.
అలాగే నాగర్ కర్నూల్ డివిజన్‌లో 553 మందికి 718.01 ఎకరాలు, గద్వాల డివిజన్‌లో 657 మందికి 993.19 ఎకరాల ప్రకారం.. మొత్తం 2990 మంది లబ్దిదారులకు 3743.36 ఎకరాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటి కోసం మండల స్థాయిలో అసైన్‌మెంట్ కమిటీ సమావేశానికి చైర్మన్లుగా వ్యవహరించే ఎమ్మెల్యేలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటి వరకు వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉనప్న ఎమ్మెల్యేలు అసైన్‌మెంట్ క మిటీ సమావేశానికి హాజరు కాలేదనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుతం 3568.19 ఎకరాల భూ పంపిణీ ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులు 2852 మంది భూ పంపిణీ కోసం ఎదురు చూస్తున్నారు. ఏడో విడత భూ పంపిణీలో ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో 86 మంది లబ్ధిదారులకుగాను 97.13 ఎకరాలు, నారాయణపేట డివిజన్‌లో కేవలం 78.04 ఎకరాలు మొత్తం ఇప్పటి వరకు 175.17 ఎకరాలు మాత్రమే భూ పంపిణీ చేశారు. మిగిలిన 3568.19 ఎకరాలు పంపిణీ చేయడానికి ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సి ఉంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తాము సూచించిన అనుచర వర్గం పేర్లు జాబితాలో లేవని అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలకు వెళ్లడం లేదని తెలిసింది. ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు స్పందించి అర్హులైన పేదలకు సకాలంలో భూ పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తీరికలేదట!
Published Wed, Dec 18 2013 3:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement