అలుగు కట్టపై మొలచిన పిచ్చి మొక్కలు
మహబూబ్‌నగర్, దేవరకద్ర: కోయిల్‌సాగర్‌పై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గేట్లవద్ద లీకేజీలు పెరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఇటీవలే ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ పరిధిలోకి చేర్చినా ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో ప్రాజెక్టు నిండినప్పుడు నెల కొన్న సమస్యలే మళ్లీ కనిపిస్తున్నాయి. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోతల పథకం ద్వార ప్రాజెక్టును నీటితో నింపుతున్నారు. కానీ ఇక్కడ నెలకొన్న సమస్యలను మాత్రంగా గాలికి వదిలేశారు.
గేట్ల కింది నుంచి లీకేజీ
ప్రాజెక్టు నీటి మట్టం మంగళవారం 29 అడుగులకు చేరువలో ఉంది. పాత అలుగు స్థాయి 27 అడుగుల వరకే ఉండడంతో సోమవారం నుంచే గేట్ల కింద నుంచి లీకేజీలు ప్రారంభమయ్యాయి. లీకేజీల వల్ల కొంత వరకు నీరంతా వృథాగా వాగులోకి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు గేట్ల స్థాయి 33 అడుగులు కాగా మరో నాలుగు అడుగుల నీరు చేరితే గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. 1981లో కోయిల్‌సాగర్ అలుగు కట్టపై షెట్టర్లను బిగించి గేట్లను ఏర్పాటు చేశారు. చాలా కాలంగా గేట్లను ఉపయోగించక పోవడం వల్ల కింద నుంచి లీకేజీలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే షెట్టర్ల కింద నుంచి లీకేజీలు కనిపించాయి. కానీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
ముందస్తు చర్యలు అవసరం
27 అడుగులకు నీటి మట్టం చేరక ముందే నీటి లీకేజీలు కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోక పోవడం వల్ల లీకేజీలు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా కాలం క్రితం షెట్టర్ల కింద వేసిన రబ్బర్ వాచర్‌లు పూర్తిగా అరిగిపోవడం వల్లే నీరు లీకేజీ అవుతోంది. గతంలో ఉన్న చిన్ననీటి పారుదుల శాఖ అధికారులు ప్రతి ఏడాది లీకేజీలు అరికట్టడానికి తాత్కాలికంగా గోనే సంచులను షెట్టర్ల కింద జొప్పించేవారు. నీటి మట్టం షెట్టర్లను దాటడం వల్ల గోనేసంచులు పెట్టడానికి కూడ వీలులేని పరిస్థితి ఉంది. ఇదిలాఉంటే అలుగు కట్టపై పిచ్చి మొక్కలు మొలిచాయి. కనీసం వాటిని కూడా తొలగించడంలేదు.
అధ్వానంగా గెస్ట్‌హౌస్
ప్రాజెక్టు వద్దకు వచ్చే అధికారుల విడిది కోసం ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిర్వహణలేక పోవడం వల్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గెస్ట్‌హస్ వద్దకు వెళ్లే రోడ్డు కూడా కనిపించకుండా పోయింది. ప్రాజెక్టు కట్టపై పాదాచారులు నడిచే సీసీ అంతా కొట్టుకు పోయింది. కట్టపైకి వెళ్లడానికి ఉపయోగిం చే మెట్లు కూడా పనికి రాకుండా మారాయి. ఇక లైటింగ్ కూడా లేక రాత్రి వేళ చీకట్లు అలుముకుంటున్నాయి. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెలుగులోకి రావడంలేదు. ఇప్పటికైనా అధికారులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పట్టించుకుని పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది.
Comments
Please login to add a commentAdd a comment