
జలీల్‌ఖాన్ రాజకీయ జీవితం భూస్థాపితమే
బీజేపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ(భవానీపురం) : రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని, ఎవరినైనా విమర్శించేముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ నాయకులకు బీజేపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు హితవు పలికారు. రాష్టంలో బీజేపీ భూస్థాపితం కానుందన్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ నియోజకవర్గంలో జలీల్‌ఖాన్ మాత్రం రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. సూర్యారావుపేటలోని భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని జలీల్‌ఖాన్ నమ్మక ద్రోహి అని, వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకులోనై టీడీపీలోకి మారిన ఆయన దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు.
ప్రత్యేక హోదాపై టీడీపీ నాయకులు ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంలో మం త్రులు ఆసక్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు. మనకు 24 గంటల కరెంట్ ఇస్తున్నది కేంద్రమేనని ఎక్కడైనా చెబుతున్నారా అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, రాష్ట్ర నాయకులు ఎల్.ఆర్.కె.ప్రసాద్, పి.మాలకొండయ్య, అడపా నాగేంద్రం, బి.ఎస్.కె.పట్నాయక్, ఎం.వీరబాబు, పశ్చి మ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదిలం రాజశేఖర్, నగర ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.అర్ముగం, తోట శివనాగేశ్వరరావు, బబ్బూరి శ్రీరామ్, వి.చంద్రబాబు, డి.శ్రీదేవి, మిల్టన్ జైన్ పాల్గొన్నారు.