ఉద్యమ పిడికిళ్లు మరింత బిగుసుకుంటున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమర నినాదం చేస్తున్నాయి. సోమవారం హిందూపురంలో ‘లేపాక్షి బసవన్న రంకె’ సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలు, ఉద్యోగులు..
సాక్షి, అనంతపురం : ఉద్యమ పిడికిళ్లు మరింత బిగుసుకుంటున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమర నినాదం చేస్తున్నాయి. సోమవారం హిందూపురంలో ‘లేపాక్షి బసవన్న రంకె’ సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలు, ఉద్యోగులు.. అదే స్ఫూర్తితో మంగళవారం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా బంద్‌ను జయప్రదం చేశారు. జిల్లాలో 500 కిలోమీటర్ల మేర ‘మహా మానవహారం’ నిర్మించి ‘సమైక్య’ సత్తా చాటారు. సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యమంటూ పెద్దఎత్తున నినదించారు.
మహా మానవహారంలో అన్ని వర్గాల ప్రజలు పాలుపంచుకున్నారు. పట్టణ వాసులే కాకుండా.. గ్రామాలకు గ్రామాలు రోడ్లపైకి తరలి రావడంతో జిల్లాలో ఏ రోడ్డుపై చూసినా జనమే కన్పించారు. కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు నుంచి కర్నూలు జిల్లా సరిహద్దున ఉన్న కరిడికొండ చెక్‌పోస్టు వరకు, చిత్తూరు జిల్లా సరిహద్దులోని తనకల్లు నుంచి బళ్లారి జిల్లా సరిహద్దున ఉన్న విడపనకల్లు వరకు 500 కిలోమీటర్ల మహా మానవహారం నిర్మించారు. అనంతపురం నగరంలో పాతూరు నుంచి సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, ఓవర్ బ్రిడ్జి, నడిమివంక మీదుగా బైపాస్ రోడ్డు వరకు, సాయినగర్ నుంచి రుద్రంపేట బైపాస్ వరకు.. ఇలా నలుదిక్కులా మానవహారం ఏర్పాటు చేశారు.
ఎస్కేయూ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, ఆకుతోటపల్లి, ఇటుకలపల్లి, మారుతీపురం, ఎస్వీపురం మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఎస్కేయూ నుంచి పంగల్‌రోడ్డు వరకు మానవహారం నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలను సమైక్యవాదులు బంద్ చేయించారు. ధర్మవరం పట్టణంతో పాటు 44వ జాతీయ రహదారిపై జేఏసీ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ప్రజలు, రైతులు మానవహారం నిర్మించారు. ధర్మవరం, ముదిగుబ్బ, బత్తలపల్లి, గుంతకల్లు, పామిడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో బంద్ విజయవంతమైంది. జేఏసీ నాయకులు పచ్చిగడ్డి తింటూ నిరసన తెలిపారు. రోడ్డుపై వంటా వార్పు నిర్వహించారు. క్రిస్టియన్లు ర్యాలీ చేశారు. హిందూపురంలో బంద్ విజయవంతమైంది. ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ చేశారు.
విశాలాంధ్ర పరిరక్షణ సమితి, ఎన్‌జీఓల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద సమైక్యవాదులు నినాదాలతో హోరెత్తించారు. కదిరిలో బంద్ పాటించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బైక్ ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో బంద్ విజయవంతమైంది. జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. సమైక్యవాదులు మానవహారం నిర్మించారు. మడకశిరలో జేఏసీ నాయకులు మోకాళ్లపై భజన చేస్తూ నిరసన తెలిపారు. పుట్టపర్తిలో యువకులు జల దీక్ష చేపట్టారు. ఓడీచెరువులో రాస్తారోకో చేశారు. పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, గోరంట్లలో దీక్షలు కొనసాగాయి. రాయదుర్గంలో ఉపాధ్యాయులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నాయీ బ్రాహ్మణులు భారీ ర్యాలీ, రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కణేకల్లులో సమైక్యాంధ్ర గర్జన విజయవంతమైంది. రాప్తాడు, కనగానపల్లి, శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రంలో బంద్ పాటించారు. తాడిపత్రిలోని పోలీసుస్టేషన్ సర్కిల్‌లో మానవహారం నిర్మించారు. ఈడిగ సంఘం నాయకులు రిలే దీక్షలు చేపట్టారు.
తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, బుడగజంగాలు ర్యాలీ చేశారు. వీరికి వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా న ర్సింహయ్య మద్దతు తెలిపారు. ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆట పాటలతో హోరెత్తించారు. పెద్దవడుగూరులో జాతీయ జెండాతో మహా మానవహారం నిర్మించారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు, విద్యార్థి జేఏసీ నాయకులు మానవహారం నిర్మించి.. జల దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. కూడేరులో మానవహారంతో హోరెత్తించారు. కాగా... సమైక్యాంధ్ర వాణిని వినిపించేందుకు బుధవారం అనంతపురం నగరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘అనంత రైతు రంకె’ సభ నిర్వహించనున్నారు.