మిగిలింది ఆవేదనే!
Published Fri, Dec 6 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇన్నాళ్లూ ఏదైతే జరగకూడదని ప్రజలు ఆశించారో సరిగ్గా అదే జరిగింది. ఏ దారుణాన్నైతే చూడరాదని భావించారో ఆ ఘోరమే సంభవించింది. కేవలం ఓట్లు, సీట్లు కోసం తెలుగుజాతిని నిస్సిగ్గుగా చీల్చే కుట్రకు కాంగ్రెస్ తెగబడింది. తమ స్వలాభం కోసం ఇలా రాష్ట్రాన్ని, ఓ జాతిని ముక్కలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జాబిల్లి నుంచి వెన్నెలను, తల నుంచి మొండాన్ని, వేరు చేసినంత దారుణంగా కేంద్రం కేబినేట్ గురువారం రాత్రి రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ప్రజలు తరతరాలపాటు గుర్తుంచుకునే పరిస్థితి నెలకొంది. ఇదంతా కేవలం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల స్వార్థం, పదవీ లాలస కారణంగానే జరిగిందని, ఈ ఘోర తప్పిదానికి వారంతా భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకుంటారని జిల్లా ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
అధిష్టానాన్ని ఎదిరించలేక, పదవులను వీడలేక తమ స్వార్థ రాజకీయాల కోసం కోట్లాది మంది ప్రజలను బలి చేశారని ఆరోపిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా చేసిన ఆందోళనలు వృథాయేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా 13 జిల్లాల్లోని కోట్లాది మంది ప్రజలకు తీరని నష్టం వాటిల్లనుందని, ఇదంతా ముందే తెలిసినప్పటికీ వారంతా కిమ్మనకుండా ఉండిపోయారని, ఈ పాపంలో ప్రధాన భాగం కాంగ్రెస్ నేతలకే చెందుతుందని ఆరోపిస్తున్నారు. అధిష్టానంతో మంచి సంబంధాలుండి, వారిని ప్రభావితం చేయగలిగే నేతలు జిల్లాలో ఉన్నప్పటికీ వారంతా కేవలం తమ భవిష్యత్ అవసరాల రీత్యా పెదవి విప్పకుండా ప్రజలను బలిపశువులను చేశారని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగానికైనా, ఉన్నద విద్యకైనా, మెరుగైన వైద్యానికైనా ఇప్పటి వరకూ హైదరాబాద్ వెళ్లేవారిమని, ఇప్పుడు ఆ నగరం పరాయిదైపోతోందని వాపోతున్నారు.
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు గట్టిగా ప్రతిఘటిస్తే, ఆనాడే పదవులను త్యజిస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదని విజయనగరంలోని పాన్ షాప్ యజమాని బంగార్రాజు అన్నారు. ‘ఈ నాయకులు జనాన్ని తినీడానికి, తమ బొజ్జలు నింపుకోడానికే ఉన్నారు గానీ మనకేమాత్రం ఉపయోగపడ్నేదు. ఇలాంటోళ్లందరికీ ముందుముందు జనమే బుద్ధి సెప్తారు.’ అని ఆయన హెచ్చరించారు. భావితరాల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసి తమ పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్‌కు ఇక పుట్టగతులుండవని ఇంజినీరింగ్ విద్యార్థి మధులత శాపనార్థాలు పెట్టారు. తన చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం ఆవేదన పెల్లుబుకుతోంది.
Advertisement