=తలో మాటతో ప్రజలను మభ్యపెడుతున్నారు
=రాజీనామా చేయకుండానే టీడీపీ డ్రామాలు
=తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజం
సాక్షి, తిరుపతి: సమైక్య రాష్ట్రంపై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి లేదని, పదవీ కాంక్షతో అధిష్టానం అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తుడా కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉప్పు విక్రయిస్తూ విభజన ప్రక్రియకు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విభజన వ్యవహారంపై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తలో మాట మాట్లాడుతూ ప్రజల ను మభ్యపెడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఉప్పు అమ్ముకుని బతకాల్సిందేనని పేర్కొన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచి నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందన్నారు. సముద్ర జలాలతో ఉప్పు తయారు చేసుకుని బతకాల్సి వస్తుందని తెలిపారు.
మంచినీరు లేక వరిచేలను ఉప్పు కయ్యలుగా మార్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యావంతులు చేతివృత్తులు, కుల వృత్తులు చేసుకుని జీవించాల్సి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపితే సీమాంధ్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోతుందని చెప్పారు. సమైక్యాం ధ్ర కోరుకుంటున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు.
పార్టీ నాయకుడు పులుగోరు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, బీసీ సెల్ సభ్యుడు పుల్లయ్య, ఎస్‌సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, ఎస్‌కే.బాబు, అమరనాథరెడ్డి, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, పునీత, శాంతారెడ్డి, పుష్పాచౌదరి, గౌరి, హర్ష, అగర్వాల్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.