సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో చేపట్టిన సమైక్య ఉద్యమ కెరటం ఎగిసిపడుతోంది. జిల్లాలో 20వ రోజు సోమవారం సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో సమరదీక్ష పేరుతో నిరశనకు దిగడంతో జిల్లాలో ఉద్యమం మరింత తీవ్రమైంది. విజయమ్మకు మద్దతుగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయగిరిలో జరిగిన సమైక్య ఉద్యమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.
విజయమ్మకు మద్దతుగా గూడూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బాలచెన్నయ్య సంఘీభావ దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు విజయమ్మకు మద్దతుగా రిలేదీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం కొనసాగింది. ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతోంది. విజయమ్మ దీక్షతో జిల్లాలో ఉద్యమం మరింత ఉధృతంగా మారుతోంది.
ప్రభుత్వ వైద్య బృందం (ఐఎంఏ) ఆధ్వర్యంలో నగరంలో వీఆర్‌సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ప్రదర్శన నిర్వహించారు. అదే విధంగా నగర పాలక సంస్థ ఉద్యోగులు సంస్థ కార్యాలయం నుంచి మూలాపేట, అనితాహాలు సెంటర్,వీఆర్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకి సెంటర్, కనకమహల్ మీదుగా తిరిగి గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీని సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు జెండా ఊపి ప్రారంభించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ (ఇంజనీరింగ్) అడ్డుకునే యత్నం చేసిన విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష చేశారు. జిల్లా అధికారుల సంఘం, గెజిటెడ్ ఆఫీసర్లు ఆత్మకూరు బస్టాండ్ నుంచి వీఆర్‌సీ వరకూ ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు. రేషన్ డీలర్లు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పొదలకూరులో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేలటూరులోని ఏపీ జెన్‌కో ఇంజనీర్ల జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి ప్రాజెక్టు వరకు మోటారుసైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గూడూరులో భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని జాతీయరహదారిపై రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు బత్తిని విజయ్‌కుమార్‌తోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయ పోరాట సమితి, ఎన్జీఓ, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కోటలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఉదయగిరిలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది విధులు బహిష్కరించారు. ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి కబడ్డీ ఆడారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెంలో విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వెంకటగిరి వైఎస్సార్‌సీపీ నేత బత్తినపట్ల వీరారెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. సైదాపురం మండలం ఊటుకూరు గ్రామం బస్టాప్ సెంటర్‌లో విద్యార్థులు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరు పేటలో జేఏసీ ఆధ్వర్యంలో ఆరో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. నాయుడుపేటలో మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎగిసిన సమైక్యం
Published Tue, Aug 20 2013 6:48 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement