సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో గురువారం ఆందోళనలు హోరెత్తాయి. రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు, వినూత్న నిరసనలతో సమైక్యవాదులు కదంతొక్కారు. మచిలీపట్నంలో విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించగా, జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు రోడ్డుపై వరి నాటుతూ నిరసన తెలిపారు. ఇంకొందరు రోడ్డుపై ఆటలాడుతూ నిరసనలు వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కోనేరుసెంటర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరువూరులో కేబుల్ టీవీ ఆపరేటర్లు, అంగన్‌వాడీ సిబ్బంది నిరసన ప్రదర్శనలు జరిపారు. తిరువూరులో రిలే నిరాహారదీక్ష, నిరసన ప్రదర్శన జరిగింది.
మైలవరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వాణిజ్య వ్యాపార సంఘాల నాయకులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. గుడివాడలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో రిలేదీక్షలు జరుగుతున్నాయి. వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో నెహ్రూచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. జగ్గయ్యపేట ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు సామూహిక రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రిలేదీక్షల్లో పులిచింతల, రెవెన్యూ ఉద్యోగులు కూర్చున్నారు. రెవెన్యూ ఉద్యోగులు మోకాళ్లపై నిరసన తెలిపారు. చిల్లకల్లులో విద్యార్థులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు మానవహారం నిర్మించారు. సమ్మెలో పాల్గొనని ఉపాధ్యాయులకు వత్సవాయిలో పుష్పగుచ్ఛాలను అందజేసి సమైక్యవాదులు నిరసన తెలిపారు. ముదినేపల్లిలో జూనియర్ కళాశాల విద్యార్థులు మనవహారం చేపట్టారు. కలిదిండిలో కేసీఆర్ దిష్టిబొమ్మను వీఆర్వోలు దహనం చేశారు. పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్ల నిర్వాహకులు సమ్మెకు వెళ్లారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా మైలవరంలో ఏర్పాటుచేసిన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి.
తిరువూరు, విస్సన్నపేటల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు. తిరువూరులో కేబుల్ టీవీ ఆపరేటర్లు, అంగన్‌వాడీ సిబ్బంది నిరసన ప్రదర్శనలు జరిపారు. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, ముదినేపల్లిలో మండల పార్టీ కన్వీనర్ నిమ్మగడ్డ భిక్షాలు ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. ముదినేపల్లిలో జూనియర్ కళాశాల విద్యార్థులు మానవహారం చేపట్టారు. వైఎస్ విజయమ్మ చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల రిలేనిరాహారదీక్షలు జరిగాయి.
బెజవాడలో... విజయవాడలో ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించారు. విశాలాంధ్ర మహాసభ బృందం యాత్ర గురువారం విజయవాడ చేరింది. హెల్త్ యూనివర్సిటీ సిబ్బంది బైక్ ర్యాలీ జరిపారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది విధులను బహిష్కరించి కోర్టు గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, తాతినేని పద్మావతి, పి.గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రిలేదీక్షల్లో టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మహంతి చేపల మార్కెట్ వర్తకులు బంద్ నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించగా, ఇందిరా కాంతిపథం, డీఆర్‌డీఏ కృష్ణాజిల్లా శాఖ ఆధ్వరంలో మానవహారం ఏర్పాటుచేశారు. ఏపీఎన్‌జీవోలు మహిళా ఉద్యోగులతో ఎంజీ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఐజీఎం స్టేడియం వద్ద జరిగిన సభలో విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి నల్లమోతు చక్రవర్తి మాట్లాడారు. జిల్లాలోని హోల్‌సేల్ మెడికల్ దుకాణాలను మూసివేసి బంద్ నిర్వహించారు. కృష్ణాజిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాలప్రాజెక్టు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. మల్లికార్జునపేటకు చెందిన శ్రీదుర్గా మల్లేశ్వర ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్‌లో ఏటీఏ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి.
సమైక్య హోరు
Published Fri, Aug 23 2013 5:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement