తెలుగు ప్రజలు కలిసుంటేనే కష్టాలు తీరుతాయని, విడిపోతే నష్టాల పాలవుతారనే విషయాన్ని ప్రజలకు చాటి చేప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో బస్సు యాత్రను ప్రారంభించింది. ఉదయం పది గంటలకు వీఎల్ పురంలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర నగర వీధుల్లో కొనసాగి లాలాచెరువు వద్ద ముగిసింది.
సాక్షి, రాజమండ్రి : తెలుగు ప్రజలు కలిసుంటేనే కష్టాలు తీరుతాయని, విడిపోతే నష్టాల పాలవుతారనే విషయాన్ని ప్రజలకు చాటి చేప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో బస్సు యాత్రను ప్రారంభించింది. ఉదయం పది గంటలకు వీఎల్ పురంలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర నగర వీధుల్లో కొనసాగి లాలాచెరువు వద్ద ముగిసింది. ‘ఆంధ్రా వేరు కాదు, తెలంగాణ వేరుకాదు, రాయలసీమ వేరుకాదు, మూడు ప్రాంతాలు కలిస్తేనే తెలుగు ప్రజలు సమైక్య శక్తిని చాటగలుగుతారు’ అంటూ వాడవాడలా ప్రచారం చేస్తూ ముందుకు సాగింది. ఈ యాత్రను ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ విడిపోతే రెండు ప్రాంతాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను కాంక్షిస్తున్నారన్నారు. సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోతే విద్యుత్తు, సాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. తెలంగాణ విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్నారు.
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ద్వారా చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకరిస్తూ లేఖ పంపడం వల్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విభజన చిచ్చు రగులుకుందని దుయ్యబట్టారు. విభజన నెపాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెడుతున్న చంద్రబాబు.. సీఎం కిరణ్ మాటలకు వంత పాడుతూ అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ ప్రజలు సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజల వద్ద బలంగా వినిపిస్తామన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ మన ఎంపీలు ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు.
భారీ మోటార్ బైక్ ర్యాలీ
ముందుగా మోటారు బైక్‌ల భారీ ర్యాలీ మొదలవ్వగా, బస్సు యాత్ర అనుసరించింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బైక్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అడుగడుగునా సమైక్యాంధ్ర నినాదాలను మారుమోగించారు. ఈ యాత్ర మధ్యాహ్నానికి పుష్కర్‌ఘాట్ చేరుకుంది. అక్కడ వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ప్రధాన ప్రాంతాల్లో కొనసాగిన యాత్రలాలాచెరువులోని వైఎస్ విగ్రహం వద్ద ముగిసింది. ఈ యాత్రలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, అర్బన్ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మైనారిటీ సెల్ జిల్లా కన్వీనర్ నయూమ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్ పాల్గొన్నారు.