సాక్షి, కడప : సమైక్య ఉద్యమం ఉరుమై గర్జిస్తోంది. రెండు నెలలు సమీపిస్తున్నా ఉద్యమకారులు మాత్రం సడలని దీక్షతో ఉద్యమం చేస్తున్నారు. సమైక్య ఉద్యమం జన హృదయాలను కదిలిస్తోంది. అందుకే ఎన్నాళ్లైనా ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతోంది. వాడివేడిగా దూసుకుపోతోంది.
కడప నగరంలో మంత్రి సి.రామచంద్రయ్య ఇంటిని ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో ముట్టడించి టు లెట్ బోర్డును తగిలించి మంత్రి ఫోన్ నెంబ రును రాశారు. రిమ్స్ మెడికల్ కళాశాలలో కౌన్సెలింగ్‌ను జేఏసీ నాయకులు డాక్టర్ ఫరూఖ్, వెంకటశివ, సురేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యం లో అడ్డుకున్నారు. కౌన్సెలింగ్ వాయిదా పడింది.
న్యాయవాదులు రోడ్డుపై సమైక్యాం ధ్ర చాకిరేవు నిర్వహించి సోనియాగాంధీ, ఆంటోని, దిగ్విజయ్‌సింగ్, షిండే, ఇతర కేంద్ర మంత్రుల చిత్రపటాలను ఉతికి ఆరేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్, వాణిజ్యపన్నులశాఖ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
జమ్మలమడుగులో ఐదు వేల మందితో ఐదు కిలోమీటర్ల మేర మోటారుబైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి, టీడీపీ నాయకులు గిరిధర్‌రెడ్డి మద్దతు పలికి పాల్గొన్నారు. హిందీ ఉపాధ్యాయులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలో దీక్షలు కొనసాగాయి.
ప్రొద్దుటూరులో ఎన్జీఓలు, పెయింటర్స్ అసోసియేషన్, న్యాయవాదులు, వైద్యులు, మున్సిపల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. పాండురంగ దేవస్థానం వారు విశ్వసహస్ర పారాయణంతో ర్యాలీ చేస్తూ దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ దీక్షలు కొనసాగాయి.
రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ మీదుగా ఆర్డీఓ కార్యాలయంవరకు ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పండోళ్లపల్లెకు చెందిన శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి నేతృత్వంలో 80మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలులో సోమశిల మునక ప్రాంత వాసులు భారీర్యాలీ నిర్వహించారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. సోనియా, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హమాలీలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కలసపాడులో మహాగర్జన సభ విజయవంతమైంది.
రాయచోటిలో బలిజ సంఘం ఆధ్వర్యంలో, న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యాంధ్ర శిబిరం వద్ద ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి సమైక్యాంధ్ర పాటలు పాడించారు. ఆర్టీసీ కార్మికులు గడ్డితింటూ వినూత్న ర్యాలీ చేపట్టారు. గురువారం రాయచోటిలో జరుగుతున్న రణభేరి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు హాజరు కానున్నారు.
మైదుకూరులో రైతు సింహ గర్జన సమైక్య నినాదాలతో హోరెత్తింది. అంకాలమ్మ గుడి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. వంటా వార్పు చేపట్టారు.
రైల్వేకోడూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నాయకులు రోడ్డుపైన నిలబడి ఆందోళన చేపట్టారు. కమలాపురం నియోజవర్గంలోని చదిపిరాళ్ల గ్రామం వద్ద డప్పు వాయిద్యాలు వాయిస్తూ రాస్తారోకో చేశారు. కమలాపురంలో సర్పంచులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విభజన వల్ల కలిగే నష్టాలను వివరించారు.
పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ, బ్యాడ్మింటన్ క్రీడాకారులు భారీ ర్యాలీని నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రోడ్లపైన షటిల్ ఆడి నిరసన తెలిపారు.
ఒకటే గమ్యం
Published Thu, Sep 26 2013 2:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement