కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి ఆరు రోజులు పూర్తి చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సమైక్యమే లక్ష్యంగా ఎన్జీఓలు ముందుకు సాగుతున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఉద్యోగుల విధుల బహిష్కరణతో యథావిధిగా కార్యాలయాలు మూతపడ్డాయి.
ఉద్యమంలో భాగంగా థియేటర్లు, పెట్రోల్ బంక్‌ల బంద్ సంపూర్ణంగా జరిగింది. బుధవారం రహదారుల దిగ్బంధనానికి ఎన్జీఓలు పిలుపునిచ్చారు. కడపలో ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో థియేటర్లు, పెట్రోల్ బంక్‌ల బంద్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా విభజన జరుగుతోందని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు ఏకమై విభజన బిల్లును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు నిత్యపూజయ్య, చిన్నయ్య, డీఎంహెచ్‌ఓ జేఏసీ నాయకులు నాగలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరులో విద్యార్థులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు నగరంలో భారీ ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాలుగురోడ్ల కూడలిలో ఉపాధ్యాయుడు అంకన్న విభజనకు నిరసనగా, సమైక్యాంధ్రకు మద్దతుగా గుండు గీయించుకొని నిరసన వ్యక్తంచేశారు. మైదుకూరు పట్టణం సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. రాజంపేటలో సమైక్య పరిరక్షణ వేదిక, ఎన్జీఓ ఛెర్మైన్ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు లక్ష్మినారాయణ, శరత్‌కుమార్ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
సమైక్యమే లక్ష్యం
Published Wed, Feb 12 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement