
భిన్నత్వంలో ఏకత్వం
సందేశాత్మకంగా సాగిన ఇండియన్ నేవల్ బ్యాండ్
సాక్షి, విశాఖపట్నం: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఇండియన్ నేవల్ బ్యాండ్ రాష్ట్రపతికి గౌరవ సూచకంగా శనివారం సాయంత్రం ఇచ్చిన ప్రదర్శన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాముద్రిక నేవల్ ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిలకించారు.
74 ఏళ్లుగా నేవీ బ్యాండ్ జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలిస్తోంది. అదే విధంగా విశాఖలోనూ తమ వాయిద్యాలతో స్ఫూర్తి నింపింది. సముద్ర జలాలపై ప్రపంచ దేశాల మధ్య శాంతి, సమైక్యతలనుకోరే భారత చిహ్నంగా నేవీ బ్యాండ్ వ్యవహరిస్తోంది. అమెరికా, బ్రిటన్, రష్యా, క్యూబా, జపాన్ వంటి దేశాల్లోనూ పర్యటించి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా విశాఖలో ఇచ్చిన ప్రదర్శనలో భారత సంప్రదాయ సంగీతంతో పాటు పాప్, ఫోక్ మ్యూజిక్ వినిపించారు. సుమారు 80 నిమిషాల పాటు నేవీ బాండ్ అలరించింది.