క్రైం (కడప అర్బన్ ) : కడప నగరం ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సియోన్ పురంలో నివసిస్తున్న పాలగిరి శివతేజారెడ్డి, పద్మావతి, ఎల్లారెడ్డిల ఏకైక కుమారుడు. తన స్నేహితుడు లోకేష్‌నాయక్‌తో పాటు 2014 ఆగష్టు 4 వతేదీన కడప- కృష్ణాపురం రైల్వే ట్రాక్ మధ్యలో మృతదేహాలై తేలారు. ఈ సంఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించింది. తమ బిడ్డల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శివతేజారెడ్డి తల్లి పద్మావతి రైల్వే పోలీసులు, జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. తాలూకా పోలీసులకు దర్యాప్తు కోసం బదిలీ చేశారు.
కడప నగరంలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న సుభాన్ సాహెబ్ భార్య షేక్ షఫీవూన్ 2014 సెప్టెంబర్ నుంచి కన్పించడంలేదు. ఆమె ఆచూకీ ఇంత వరకు తెలియలేదు. తన భార్యను ఓవ్యక్తి తీసుకుని వెళ్లాడనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
2014 ఆగష్టు 7వ తేదీన కడప కోఆపరేటివ్ కాలనీకి చెందిన పాలెం భాస్కర్ రెడ్డి అదృశ్యమయ్యారు. ఇంత వరకు ఆచూకీ లభించలేదు. ఆయన సమీప బంధువు, రిటైర్డ్ అదనపు ఎస్పీ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.
మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. అనేక కేసుల్లో మిస్టరీ వీడడం లేదు. జిల్లాలో రెండేళ్లుగా ఆచూకీ తెలియని కేసులు, దర్యాప్తు కొనసాగుతున్న కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేసులు దర్యాప్తుకు చేరువలో ఉన్నాయి. కొన్నికేసుల్లో వివిధ వర్గాల ఒత్తిళ్ల నేపథ్యంలో దర్యాప్తు నత్తనడకన సాగుతున్నాయి. కడప నగరంలోని వివిధ స్టేషన్లలోని కేసులు పరిశీలిస్తే దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కడప నాగరాజు పేటలోని మహిళా వికాస పరస్పర సహకార సొసైటీ సీఈవో వేలూరు సూర్యనారాయణ భార్య శైలజ తన భర్త 2013 అక్టోబర్ 19 నుంచి కన్పించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో, కేసు నమోదు చేశారు. రూ 12 కోట్లు కుంభకోణానికి పాల్పడి దాదాపు రెండు వేలకు మంది పైగా మహిళలు తాము దాచుకున్న డబ్బు వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారంపై పలు కేసులు నమోదయ్యాయి. ఈకేసుపై సీఈవో ఆచూకీ తెలిసినా, సంస్థకు సంబంధించిన అధికారులను, డెరైక్టర్లను లోతుగా విచారిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది. ఈ కేసును ఇప్పటికే కడప సీసీఎస్ పోలీసులకు దర్యాప్తు కోసం అప్పగించారు. ఇప్పటివరకు సదరు కేసుపై పోలీసులు అంతగా శ్రద్ధ చూపడంలేదనీ విమర్శలు గుప్పిస్తున్నాయి.
కడప నగరంలోని ద్వారకా నగరంలో తన బంధువుల దగ్గర నివసిస్తున్న మేకల గోపీనాథ్ జూన్ 26వ తేదీనుంచి కన్పించడంలేదనీ, ఆస్తి విషయమై బంధువులు కన్పించకుండా చేశారనీ ఆరోపిస్తూ, గోపీనాథ్ భార్య వందన ఫిర్యాదు చేశారు.
కడప చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది వాసవి ఎన్‌క్లేవ్‌లో రామలక్షుమ్మ, రామసుబ్బారెడ్డిల ఇంటిలో జరిగిన దోపిడీపై ఇప్పటివరకు పురోగతి లేదు. అలాగే రిమ్స్ పోలీసుస్టేషన్ పరిధిలో తిలక్‌నగర్‌లో ఓ పాడుబడ్డ ఇంటిలో బాంబు పేలుడు సంభవించింది.
ఆ కేసులో ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఆ సంఘటనలో చిన్నారులు గాయపడ్డారు.
ఇంకా కడప నగరంలో దోపిడీలు, దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో ఇండిక్యాష్ ఏటీఎంపై దుండగులు దాడి చేసి నానా బీభత్సం సృష్టించి ఏటీఎంనే ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సంఘటనపై విచారణ కొనసాగుతోంది.
అంతు ‘చిక్కని’ నేరాలు
Published Thu, Aug 6 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement
Advertisement