గుంటూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సుమారు నాలుగువేల మందుల షాపులు ఉండగా ఒక్క గుంటూరులోనే సుమారు 700 వరకు ఉన్నాయి. వీటిల్లో చాలా షాపులు నిబంధనల మేర నిర్మాణం జరగలేదు. పేరుగాంచిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం మందుల షాపులు సక్రమంగా లేవు. కొందరు చిన్న సందులో, మరి కొందరు ఇరుకు గదుల్లో ఇలా ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో ఉన్నాయి. నిర్మాణ లోపాలతోపాటుగా ఔషధాలు పాడవకుండా నిల్వ చేసేందుకు కొన్ని షాపుల్లో శీతలీకరణ యంత్రాలూ లేవు.
ఇటీవల సంగడిగుంటలోని ఓ మందుల షాపులో చిన్నపిల్లలకు సంబంధించిన మందులను స్థానికుడు కొనుగోలు చేశాడు. తీరా ఇంటికి వెళ్లి చూశాక అందులో పురుగులు దర్శనమిచ్చాయి. జీజీహెచ్‌లోని మెడికల్ స్టోర్‌లో కూడా ఇంజెక్షన్‌లో పురుగులు ప్రత్యక్షమవటంతో ఆస్పత్రి అధికారులు ఖంగు తిన్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పనితీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం పలు విమర్శలకు తావిస్తుంది.
తూతూ మంత్రంగా తనిఖీలు
ఔషధ తనిఖీ అధికారులు నెలకు కనీసం 50 తనిఖీలు నిర్వహించాలి. అందులో 10 డ్రగ్ నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం పంపించాలి. కాని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు చేస్తున్న తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. షాపులో పదో తరగతి తప్పిన వ్యక్తి మందుఉయ అమ్ముతూ జిల్లా వైద్యాధికారులకు రెండేళ్ల కిందట దొరికిపోయాడు. చాలా షాపుల్లో అర్హత లేని వారే మందులను విక్ర యిస్తున్నారు. షాపుల నిర్వాహకులకుగాని, మందుల విక్రయాలు చేసే వారికి కాని అర్హతలు లేకుండానే జిల్లాలో జోరుగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్‌ను దుకాణదారులు ఎగ్గొడుతున్నారు. ఇటీవల జీజీహెచ్‌లోని జనరిక్ మందుల షాపులో బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేసిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆరు లక్షల రూపాయలు జరిమానా విధించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లుకు ఈ విషయం తెలిసినప్పటికీ తమకు వచ్చే మామూళ్ల వల్ల వ్యాపారస్తులపై ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వివరణ.. నిబంధనల ప్రకారం ఉన్న మందుల షాపులకే అనుమతులు ఇస్తున్నట్లు గుంటూరు అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. తన పరిధిలో సుమారు 700 వరకు మందుల షాపులు ఉన్నాయని, వాటిల్లో నిబంధనలు పాటించని ఐదుగురు షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రతి నెలా తన పరిధిలోని 50 మందుల షాపులను నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్టు వెల్లడించారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి.. హోల్‌సేల్, రిటైల్ మందుల షాపులను నిర్మించాలంటే తప్పని సరిగా 15 స్కేర్ మీటర్లలో నిర్మించాలి. రిటైల్‌షాపునకు తప్పని సరిగా ఫార్మసీ అర్హత కలిగిఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ (బి.ఫార్మసీ లేదా డిఫార్మసీ విద్యార్హత)లో రిజిస్టర్ చేయించుకుని ఉండాలి. మందులు, ఇంజెక్షన్‌లు పాడవుకుండా డ్రగ్స్ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటి కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్‌ను షాపులో ఏర్పాటు చేయాలి.
ప్రాణాలతో చెలగాటం
Published Sat, Nov 23 2013 4:41 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement