
భద్రత లేని బోట్లు
నిజాంపట్నం హార్బర్‌ను కేంద్రంగా చేసుకుని ఏర్పాటు చేసుకున్న రూ. కోట్ల విలువైన బోట్లు, లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఐలు వలల భద్రతపై మత్స్యకారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట విశాఖ జిల్లాను తుడిచిపెట్టిన హుదూద్ తుపాను నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధిలో పాలకులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి మూల్యం చెల్లించుకోక తప్పని రోజు వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
హుదూద్ వంటి తుపాను ఏదైనా జిల్లాలో సంభవిస్తే తొలుత నిజాంపట్నం హార్బర్‌లో బోట్లకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాక కోట్లాది రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు గండిపడనుందంటున్నారు. ఇప్పటికైనా హార్బర్‌లోని జెట్టీ సామర్థ్యం పెంచి బోట్లుకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో విపత్తుల సమయంలో కోట్ల విలువైన బోట్లు, ఐలు వలలను కోల్పోక తప్పదంటున్నారు.
రేపల్లె: తీర ప్రాంతమైన నిజాంపట్నంలో 1986లో హార్బర్ ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా 50 బోట్లు నిలుపుకునే విధంగా జెట్టీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తీరప్రాంత మత్స్యకారులకు నిజాంపట్నం కేంద్రంగా మారింది.
వారం, పది రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేట చేసుకుని వచ్చిన మత్స్య సంపదను నిజాంపట్నం హార్బర్‌లో అమ్ముకుంటుంటారు. నిత్యం మత్స్య సంపదను చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, హైదరాబాద్‌లకు ఎగుమతి చేస్తుంటారు. దీంతో ప్రతి ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే కేంద్రగా మారింది. నిజాంపట్నం హార్బర్‌లో ఏ ఏటికాయేడు మెక్‌నైజ్డ్ బోట్లు, మోటారైజ్డ్ బోట్లు గణనీయంగా పెరిగి ప్రస్తుతంనిజాంపట్నంలోనే 300కు పైగా ఉన్నాయి. వీటికి తోడు విపత్తుల సమయంలో ఇతరప్రాంతాలకు చెందిన బోట్లు హార్బర్‌కు చేరుతుంటాయి.
బోట్లు నిలుపుకునేందుకు జెట్టీ సరిపోకపోవటంతో విపత్తుల సమయంలో రేవుల్లో బోట్లు నిలిపి ఒడ్డునే ఉండే చెట్లకు తాళ్లతో కట్టి వెళ్లిపోతుంటారు. ఈ పరిస్థితుల్లో తాళ్లు తెగి బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల మధ్య నిజాంపట్నం హార్బర్‌కు సమీపంలో తుపానులు తీరం దాటితే ఆ ప్రభావానికి హార్బర్‌లో కోట్లా ది రూపాయల విలువైన బోట్లకు నష్టం వాటిల్లుతోంది.
జెట్టీ సామర్థ్యం పెంపుపై కదలని ఫైల్
హార్బర్ ఏర్పాటు సమయంలో నిర్మించిన జెట్టీ సామర్థ్యం పెంచాలని మత్స్యకారులు చేసుకున్న విన్నపాలకు అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు స్పందించారు. హార్బర్ సమీపంలోని 5 ఎకరాల అటవీ భూమిని హార్బర్ అభివృద్ధికి కేటాయించే విధంగా కృషి చేశారు. అనంతరం జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో ఆయన మాజీ కావడంతో ఆఫైలు ముందుకు కదలలేదు.
వరుస తుపానుల ప్రభావంతో నిరంతరం నష్టాల బారిన పడుతున్న మత్స్యపరిశ్రమ పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవటంలో పాలకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
1990 మే 9న సంభవించిన తుపాను ప్రభావంతో హార్బర్‌లోని బోట్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిని మత్స్యకారులు ఆర్థికంగా కుంగిపోయారు. కోలుకోవటానికి ఏళ్లు పట్టింది. ప్రతి ఏటా సంభవిస్తున్న తుపానుల కారణంగా మత్స్యకారులు నష్టపోతూనే ఉన్నారు.
ఇప్పటికైనా పాలకులు నిజాంపట్నం హార్బర్‌లో బోట్లు నిలుపుకునేందుకు జెట్టీ ఏర్పాటుపై దృష్టి సారించాలని మత్స్యకారులు కోరుతున్నారు.