
అకాల వర్షం...అపార నష్టం
♦ కళ్లాలపై పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
♦ నక్కపల్లిలో 80 మి.మీ.వర్షపాతం
♦ 5వేల ఎకరాల్లో పంటలకు నష్టం
♦ మరో రెండు రోజులు కురిస్తే మరింత కష్టం
సాక్షి, విశాఖపట్నం : మొన్న వడగండ్ల వాన..నేడు అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఈదురు గాలులతో కురిసిన భారీవర్షం అన్నదాతల ఆశలను చిది మేసింది. హుద్‌హుద్ దెబ్బకు విలవిల్లాడిన జిల్లా రైతులు ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత కనివినీ ఎరుగని వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రెండోపంటసాగు చేస్తే చేతి కంది వచ్చే సమయంలో ్రపకృతి ప్రకోపానికి తల్లడిల్లిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి సుమారు ఐదువేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి.
జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లాలో సరాసరిన 10.5 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. అత్యధికంగా నక్కపల్లి మండలంలో 80.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పెందుర్తి మండలంలో ఒక మిల్లిమీటర్ వర్షపాతం నమోదైంది. ఈసీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో నక్కపల్లి తర్వాత జి.మాడుగులలో 53.8, హుకుంపేటలో 49.6, అనంత గిరిలో 34.6,అచ్యుతాపురంలో 34.2, మునగపాకలో 31, ఎస్.రాయవరంలో 23.4, చోడవరం లో 22.8, అరకులోయలో 17.2 అనకాపల్లిలో 16.2, కశింకోటలో 15, పరవాడలో 12.4, కె.కోటపాడులో 11.6, పాడేరులో 10.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 10మిల్లిమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో రబీ సీజన్‌లో సరాసరిన సాగు విస్తీర్ణం 35,520 హెక్టార్లు కాగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 26,440 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. రెండున్నరవేల హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా, 17వేల హెక్టార్లలో అపరాలు,7,300 వేల హెక్టార్లలో వలిసలతో పాటు మొక్కజొన్న తదితర సాగవుతు న్నాయి. వరిపంటయితే ప్రస్తుతం 75 శాతం వరకు కోతలయ్యాయి. 25 శాతం పంట ఇంకా చేలల్లోనే ఉంది. కోతలు పూర్తయినా నూరుశాతం నూర్పులు జరగలేదు. మొన్నటి వడగండ్ల వానకే చాలా చోట్ల పంటలు నేరకొరిగాయి. శుక్రవారం తాజాగా కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 2వేలఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్టుగా జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. మరో 500 ఎకరాల్లో ఇంకా నీరు నిలబడిపోయినట్టు చెబుతున్నారు.
మొక్క జొన్న, చోళ్లు, అపరాలపంటలు మరో మూడువేల ఎకరాల వరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో మాడుగుల, నక్కపల్లి, అరకులోయ, చోడవరం, పాడేరు తదితర ప్రాంతాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లగా, మిగిలిన ప్రాంతాల్లో మాత్రం కొద్దిపాటి నష్టాన్ని కల్గించాయి. అరకులోయ మండలంలో చినలబుడు పంచాయతీలో వేసిన సుమారువంద ఎకరాల్లో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే మండలంలోని శిమిలిగుడ మిని రిజర్వాయర్‌కు తలుపులు వేయక పోవడంతో కొత్తభల్లుగుడ, గద్యగుడ, శిమిలిగుడ గ్రామాల్లో సుమారు 25 ఎకరాల వరి పంటలు కొట్టుకు పోయినట్టుగా రైతులు చెబుతున్నారు.
హుకుంపేట మండలంలో రబీలో వేసిన 630 హెక్టార్ల వరిపంట నీట మునిగింది. భీమిలి డివిజన్‌లో 250 హెక్టార్లలో మొక్క జొన్న,40 హెక్టార్లలో చోడి పంటలు దెబ్బతిన్నాయి. మాడుగుల 12వేల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా తాజా వర్షానికి సగానికైపైగా పంటలు నీళ్లపాలయ్యాయి. మాడుగుల నియోజకవర్గ పరిధిలోనే మొన్నటి వడగండ్ల వానకు 500ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ఈరోజు కురిసిన వర్షాలకు మరో 1000 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీటిలో 400 ఎకరాల్లో నువ్వుల చేనులు కూడా ఉన్నాయి. అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలకు ఏడు మేకలు, రెండు పశువులు కూడా మృత్యువాత పడ్డాయి.చేతికందివచ్చే సమయంలో కురిసిన భారీవర్షాలకు రైతులు విలవిల్లాడి పోతున్నారు. మరో రెండురోజులు ఇదే రీతిలో వర్షాలు కురిస్తేమాత్రం ముంపునకు గురైన పంటలు పూర్తిగా దెబ్బతినే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు.
నక్కపల్లిలో 8 సెంటీమీటర్ల
నక్కపల్లి: నక్కపల్లిలో శుక్రవారం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షం పడటంతో జాతీయ రహదారితోపాటు, పట్టణంలో వీధులన్నీ జలమయమయ్యాయి. ఎనిమిది సెంటీమీటర్ల (88.86మిల్లీమీటర్ల ) వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది ఇంతవరకు ఇంత భారీ వర్షం పడలేదు. నక్కపల్లి ఏరియా ఆస్పత్రి, తహశీల్దార్‌కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాలలో అధికంగా నీరు చేరింది. పట్టణంలో బండారుపేట, కొత్తపేట, వీవర్స్‌కాలనీ, వెంకటనగర్‌కాలనీలతోపాటు ప్రధాన వీధులు రోడ్లుపై నుంచి నీరు ప్రవహించింది. జాతీయ రహదారిపై కూడా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కొద్దిగా ఇబ్బందిగా మారింది. నక్కపల్లితోపాటు పాయకరావుపేట పట్టణంలో కూడా భారీ వర్షం పడింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.