అకాల వర్షం
► తడిసిన జొన్న, మొక్కజొన్న బస్తాలు
► తెనాలిలో కుండపోత... వీధులు జలమయం
► పలుచోట్ల నేలకొరిగిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలు
సత్తెనపల్లి/తెనాలిటౌన్ : నడివేసవిలో అకస్మాత్తుగా శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు సత్తెనపల్లి ప్రాంతంలోని చెట్లు నేలకొరగగా, విద్యుత్ తీగలు తెగి సరఫరాకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల ధాన్యం, కల్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు తడిసిపోయాయి. సత్తెనపల్లి మండలం లక్ష్మీపురంలో అరటి తోటలు పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యాయి. మిరపకాయలు, ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టాల్సివచ్చింది. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సరుకుపై పరదా పట్టలు కప్పినప్పటికి కొంత తడిసిపోయింది.
తెనాలి ప్రాంతంలో...
తెనాలిలో కుండపోత వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సుమారు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో ప్రజలు, వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి, పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో మురుగు కాల్వలోని నీరు కూడ వర్షపు నీటిలో కలిసి దుర్గంధ భరితంగా మారింది. రోడ్లపై నీరు నిలిచింది.
రైతులకు ఇబ్బంది...
తెనాలిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న జొన్న, మొక్కజొన్న బస్తాలను తడవకుండా కాపాడుకునేందుకు పలు అవస్థలు పడ్డారు. గ్రామాల్లోని కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, జొన్న స్వల్పంగా తడిసింది. తడిసిన సరుకులకు కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గింజలు బూజు పట్టి నల్లగా మారే ప్రమాదం ఉండటంతో ధరలు తగ్గవచ్చని చెపుతున్నారు. వర్షం తగ్గిన తరువాత సరుకులను ఎండలో ఆరబెట్టాలని మండల వ్యవసాయాధికారి కె.అమలకుమారి రైతులకు సూచించారు.
వాణిజ్య పంటలకు లాభం ...
ఈ వర్షం వల్ల వాణిజ్య పంటలకు లాభం చేకూరింది. తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో సాగు చేస్తున్న అరటి, కూరగాయ పంటలు, ఆకు కూర పంటలకు వర్షం మేలు చేసింది. దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు కాటాలకు ఆటంకం ఏర్పడింది. ఆరు బయట పోసిన పసుపు రాశులు తడవ కుండా యార్డు సిబ్బంది, రైతులు పట్టలు కప్పారు. కొత్త మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్న, మొక్కజొన్న స్టాకు పాయింట్ వద్ద అన్‌లోడింగ్‌కు కాస్తంత ఆటంకం ఏర్పడింది.
మండల కేంద్రమైన పెదకాకాని యువజన నగర్‌లో వేపచెట్టు వేర్ల సహా పైకి లేచి పక్కనే ఉన్న కరెంటు తీగలపై పడింది. దీంతో రెండు కరెంటు స్తంభాలు విరిగి పడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్‌శాఖ సిబ్బంది సరఫరా నిలిపివేశారు.చేబ్రోలు మండలం పరిధిలోని చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, శలపాడు, శేకూరు, వీరనాయకునిపాలెం గ్రామాల లో మామిడి, సపోట తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.