బద్వేలు: ఉపాధి హామీ పథకం అమలుపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పథకాన్ని కొన్ని మండలాలకే పరిమితం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ తరుపున ఇటీవల ఉపాధి సిబ్బంది చేపట్టిన సమగ్ర సర్వే ఇందుకు బలం చేకూర్చుతోంది. ఆయా మండలాల్లో ఉపాధి హామీ ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు విద్యావంతుడి తోడుగా ఈ సర్వే చేపట్టారు.
జిల్లాలోని అట్లూరు, బి.కోడూరు, బి.మఠం, చక్రాయపేట, దువ్వూరు, గాలివీడు, కలసపాడు, లక్కిరెడ్డిపల్లె, పెండ్లిమర్రి, రాజుపాలెం, రామాపురం, సంబేపల్లి, కాశినాయన, వీరబల్లి, పెద్దముడియం మండలాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఐదు విభాగాల్లో ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో మొదట కులం, జాబ్‌కార్డు, రేషన్‌కార్డు, ఇళ్లు తదితర వివరాలను నమోదు చేస్తున్నారు.
దీంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, భూమి, ఇళ్లు, ఉపాధి, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఉపాధి కింద పని అవసరమా... లేదా, అవసరమైతే ఏయే రకాల పనులు కోరుతున్నారు అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని 655 మండలాలకు గాను 146 మండలాల్లో ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఏళ్లతరబడి కరవుతో విలవిల్లాడే మండలాలను సర్వేకు ఎంపిక చేశారు. ఈ సర్వేతో అక్కడ ఏటా ఎందుకు కరవు చోటు చేసుకుంటోందో తెలిసే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
ఉపాధి ఈ మండలాల్లోనేనా...!
ఉపాధి పనులు ఈ మండలాల్లో మాత్రమే చేపట్టేందుకే సర్వేను ప్రారంభించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెల కిందట కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌గడ్కరి చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉపాధి పనులు చేపట్టినా పలు ప్రాంతాల్లో ఎంతమాత్రం ప్రయోజనం లేదని, కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా పనులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేను చేపట్టారు.
ఏళ్ల తరబడి కరవు ఉన్న మండలాలను ఎంపిక చేయడం, పని అవసరమా... లేదా, ఏయే రకం పనులు అవసరమనే వివరాలు సేకరించడం కూడా ఈ ప్రాంతాల్లోనే పనులు చేపడతారనే అనుమానానికి బలం చేకూరుతోంది.
జన్మభూమి తర్వాత ఎంపీడీఓలకు బాధ్యత
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామస్థాయిలో గ్రామకార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పజెబుతూ గత నెల చివరివారంలో జీఓ విడుదల చేసింది. అయితే విధి విధానాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఎంపీడీఓలు ఏమి చేయాలో తెలియక ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉపాధి హామీ బాధ్యతలకు సంబంధించి గత గురువారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. డిజిటల్ సిగ్నేచర్ కీలను కూడా ఎంపీడీఓలకు అప్పజెప్పాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జన్మభూమి తరువాత ఎంపీడీఓలు పథకం బాధ్యతలు చేపట్టే అవకాశముందని డ్వామా అధికారులు చెబుతున్నారు.
‘ఉపాధి'కి ఎసరు?
Published Tue, Nov 11 2014 2:40 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement