ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై జరిగిన వాగ్వాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దానికి చంద్రబాబు తానా అంటే తందానా అంటున్నారని, ఇదెక్కడి చోద్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. హోదా గురించి ఆయన సంధించిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేని అధికార పక్షం పదే పదే తమ మంత్రులతో ఎదురు దాడులకు దిగింది. చివరకు చంద్రబాబు కూడా పదే పదే జగన్ ప్రసంగానికి అడ్డు తగిలి తాము అనుకున్న తీర్మానాన్ని తూతూమంత్రంగా ఆమోదింపజేసుకున్నారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు అంశం వచ్చినప్పుడు కూడా అలాగే మధ్యలో ప్రతిసారీ జగన్ ప్రసంగానికి మంత్రులు, చీఫ్ విప్ తదితరులు అడ్డు తగులుతూనే ఉన్నారు.
ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం పూర్తిగా నో చెప్పిందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి దిగారని, అయితే.. అసలు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము ఎప్పుడూ సిఫార్సు చేయలేదన్న విషయాన్ని ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ లిఖితపూర్వకంగా చెప్పారని, మరో సభ్యుడు గోవిందరావు, చైర్మన్ వైవీ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఇదే చెప్పారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబుకు అది కనపడదన్నారు. ఆర్థిక సంఘం ప్రతిపాదనలు వచ్చిన తర్వాత కూడా ఇదే అసెంబ్లీలో రెండుసార్లు చంద్రబాబు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తీర్మానం చేయించారని, అప్పుడు ఆయనకు 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందో తెలియదా అని ప్రశ్నించారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అంటూ నిలదీశారు. ప్రత్యేకహోదా వస్తే ఏమున్నాయని చంద్రబాబు అంటారని, మరి ఈయనే ఎన్నికల సమయంలో మోదీని పక్కన పెట్టుకుని ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని చెప్పారని, ఐదేళ్లలో హోదా అయిపోతే అభివృద్ధి ఆగిపోతుందని ఈయనే మాట్లాడిన సందర్భాన్ని మర్చిపోతే ఎలాగని అడిగారు.
చంద్రబాబు అధికారంలోకి రాకముందే, మార్చి 2వ తేదీ నాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి ప్రణాళికా సంఘానికి పంపిందని, అప్పటి నుంచి ఈయనకు దాదాపు పది నెలల పాటు చంద్రబాబుకు ఉన్నా వీళ్లు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. పోలవరం ముంపు మండలాల గురించి చాలా కష్టపడ్డానని గొప్పలు చెబుతున్నారని, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్నీ ఇస్తూ ప్రత్యేకహోదా కూడా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా మాటిచ్చారని, అన్నీ ఇస్తామని వాళ్లు చెప్పినప్పుడు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని సంకేతాలు ఇచ్చినా దాని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 91లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తున్నట్లు చెప్పారని, కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును చేపడతామందని, ఇవన్నీ వాళ్లు చేస్తామన్నారని, ఇవి చేస్తూనే మరోవైపు ప్రత్యేక హోదా ఇవ్వబోమంటే చంద్రబాబు దానికి తాన తందానా అంటున్నారని.. దాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్లు మాత్రం.. అసలు ప్రత్యేక హోదాను పూర్తిగా రద్దు చేస్తామని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, దాంతో సమానంగా ఇచ్చే ప్రత్యేక సాయానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందున కేంద్రానికి ధన్యవాదాలు చెప్పాలని, అలా చెప్పకపోతే అది పెద్ద పాపమని అన్నట్లుగా సభలో అన్నారు. వైఎస్ జగన్ మాట్లాడుతుండగా మధ్యలో ఐదేసి నిమిషాలకు ఒకసారి మంత్రులు, చంద్రబాబు అడ్డు తగలడంతో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు.