తెలుగు దేశం పార్టీ అటు జిల్లాలోను, ఇటు నగరంలోనూ ఇబ్బందులు పడుతోంది. ఓ వైపు వలసల రాకతో ... మరో వైపు అంతర్గతంగా క్యాడర్‌ను సమర్థించుకోలేక ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టే ప్రయత్నం చేస్తుండడంతో సీనియర్లలో అసంతృప్తి పెల్లుబుకుతోంది.
నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులు వ్యవహరించిన తీరు ఆ పార్టీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం జెండాను మోసి, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారిని పక్కన పెట్టి, నియోజకవర్గ ఇన్‌చార్జుల కారు డోర్లు తీసేవారికి, ఇళ్ల వద్దకు వెళ్లి కాకాలు పట్టేవారికి టిక్కెట్లు ఇచ్చారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఇప్పుడు తమకు చేసిన అన్యాయానికి త్వరలోనే తగిన మూల్యం ఆయా నేతలు చెల్లిస్తారంటూ తెలుగుతమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశంలో కొంతమంది నేతలు నిస్సిగ్గుగా సీట్లు అమ్ముకోవానికి కూడా వెనుకాడలేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నామినేషన్ల దాఖలు ఘట్టం పూర్తయ్యేలోపుగా నేతలు తమ తప్పు తెలుసుకోకపోతే వారి బండారాలను బట్టబయలు చేస్తామని ఒకరిద్దరు నేతలు బహిరంగంగానే నిరసన గళం విప్పారు.
ఫ్లోర్ లీడర్‌కు డివిజన్ లేదు...
తాజా మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణరావుకు డివిజన్ కేటాయించలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. 57,45,27,10 డివిజన్లలో ఏదో ఒక సీటు ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానంటూ పార్టీ నాయకత్వానికి తెలిపారు. అయితే 57,45 డివిజన్లు రమణకు ఇవ్వనంటూ బొండా ఉమామహేశ్వరరావు భీష్మించుకుని కూర్చోగా, 27వ డివిజన్ విషయంలో నాగుల్ మీరా సున్నితంగా తిరస్కరించారు.
రమణకు 10 డివిజన్ ఇచ్చేది లేదని గద్దెరామ్మోహన్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారట! దీంతో తనకు డివిజన్ కేటాయించాలంటూ మూడుసార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన ఈ బీసీ నేత తెలుగుదేశంలోని ఒక బలమైన సామాజిక వర్గం నేతల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో చికాకు చెందిన ఎరుబోతు రమణ 45వ డివిజన్‌కు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రమణకు సీటు ఇవ్వకుండా ఆయన మరదలు శ్రావణికి 52 డివిజన్ కేటాయించి చేతులు దులుపుకున్నారు.
బీసీలకు పెద్ద పీటంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు పార్టీలో బీసీ సామాజిక వరానికి చెందిన ఫ్లోర్ లీడర్‌కు జరిగిన అన్యాయం చూసి పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. మరోసారి ఎన్నికైతే మేయర్ రేస్‌లోకి వస్తారనే ఉద్దేశంతో ఆయన్ను పోటీ నుంచి తప్పించినట్లుగా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇండిపెండెంట్లుగా సీనియర్ నేతలు
గత కౌన్సిల్‌లో కార్పొరేటర్లుగా టీడీపీకి ప్రాతినిధ్యం వహించిన చెన్నుపాటి ఉషారాణి, నల్లూరు ఉషారాణిలకు ఈసారి మొండి చెయ్యి చూపించారు. దీంతో చెన్నుపాటి ఉషారాణి 8వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమైపోయారు. 13వ డివిజన్ విషయంలో కోగంటి రామారావు, చెన్నుపాటి గాంధీల మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగినప్పటికీ, ఎన్జీవో నేత సిఫార్సుతో చెన్నుపాటి గాంధీ సీటు దక్కించుకున్నారు. దీంతో సుదీర్ఘకాలం పార్టీకి పనిచేయడమే కాకుండా రూ.40 లక్షల విలువైన స్థలం ఇచ్చిన కోగంటి రామారావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఆయన భార్య కోగంటి విమలకుమారి గత కౌన్సిల్‌లో కార్పొరేటర్‌గా ఉండటం గమనార్హం. ఈ డివిజన్ వారికి కేటాయిస్తే కచ్చితంగా గెలిచేవారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 28వ డివిజన్ నుంచి పోటీ చేయాలనుకున్న మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు, 33వ డివిజన్ నుంచి బరిలోకి దిగాలని భావించిన కరిముల్లాకు కూడా సీట్లు దక్కకపోవడంతో వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగే అవకాశాలుకనపడుతున్నాయి.
25వడివిజన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉమ్మడి వెంకటేశ్వరరావు(చిన్నా)కు అన్యాయమే జరిగింది. అలాగే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా పనిచేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను అనుబంధ సంఘాలకే పరిమితం చేశారు. ఇక్కడ నాయకులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు కొంతమంది నేతలు సమాయత్తమవుతున్నట్టు తెలిసింది.